Tuesday, May 7, 2024

గాంధీ భవన్ మెట్లెక్కను.. అది టీడీపీ పీసీసీ: కోమటిరెడ్డి సంచలన ప్రకటన

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ  కొత్త అధ్య‌క్షులుగా రేవంత్ రెడ్డిని నియమకంపై అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా పీసీసీ రేసులో రేవంత్ తో పోటీ పడిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై గాంధీభవన్ మెట్లు ఎక్కనని ప్రకటించారు. టీపీసీసీ కాస్త టీడీపీ పీసీసీగా మారిందని వ్యాఖ్యానించారు. టీపీసీసీ పదవిని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు మాదిరిగా.. నోటుకు పీసీసీని అమ్మేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు తనను కలవద్దన్నారు. సోనియా, రాహుల్ గాంధీపై విమర్శలు చేయనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గం ప్రజలకే పరిమితం అవుతానని తెలిపారు. సోమవారం నుంచి ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కొత్త నాయకత్వంలో హుజూరాబాద్‌లో డిపాజిట్లు తెచ్చుకోవాలని సూచించారు. తన రాజకీయ భవిష్యత్తు అంతా తన కార్యకర్తలే నిర్ణయిస్తారని తెలిపారు.

‘’పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయి.. ఎన్నికల్లో డిపాజిట్లు రాని వారికి కూడా కమిటీలో పదవులు దక్కాయి. కాంగ్రెస్ ను నమ్ముకున్నవారికి అన్యాయం జరిగిందని కార్యకర్తలు అంటున్నారు. టీపీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదు’’ అని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా, టీ.పీసీసీ పదవిని కోమటి రెడ్డి ఆశించారు. అయితే, అనూహ్యంగా రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అయితే రేవంత్‌.. సీనియర్లను, తనను వ్యతిరేకించిన వారిని కూడా కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీలో అసంతృప్తి నేతలతో రేవంత్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల నుంచి రేవంత్‌కు ఏమేర సహకారం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒకరిద్దరు నేతలు రాజీనామాలు ప్రకటించగా.. మిగతావారు ఎలా స్పందిస్తారన్న దానిపై టీపీసీసీ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది.

ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఏంటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement