Wednesday, May 1, 2024

Spl Story: అమ్మ, ఎందుకంత భారం అవుతోంది.. పెరుగుతున్న వృద్ధాప్య కేంద్రాలు

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి): తాను తిన్నా, తినకున్నా పిల్లలకు కడుపునిండా పెడుతుంది.. తినలేమ‌ని మారాం చేసినా లాలించో, బుజ్జగించో, బెదిరించో అన్నం పెడుతుంది. పిల్లలు తిన్నతరువాతే మిగిలితే తింటుంది.. లేకుంటే మంచినీళ్లతో కడుపునింపుకుంటుంది.. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కడుపులో దాచుకుంటుంది. బిడ్డకు చిన్నపాటి కష్టమొచ్చినా తట్టుకోలేకపోతుంది. ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తరువాత తల్లి రుణం తీర్చుకోవల్సిన పిల్ల‌లు అది త‌మ బాధ్యత కాదనేలా వ్యవహరిస్తున్నారు. వంతుల వారీగా త‌ల్లిదండ్రుల‌ను పంచుకుంటున్నారు. తమ పిల్లలతోపాటు నాలుగు మెతుకులు పెట్టేందుకు కూడా భారంగా భావిస్తున్నారు. అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డను జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేతను మరిచిపోతుంది. ఏడిస్తే పాలిచ్చి ఆకలితీర్చుతుంది.. అలాంటి అమ్మను కడవరకు కంటికి రెప్పలా చూసుకోవలి. కానీ, చాలామంది వారిని భారంగా భావించి ఇంటినుండి గెంటేస్తున్నారు. కొందరైతే వయోదికాశ్రమాలకు తరలిస్తున్నారు. కొడుకు, కోడలు, మనుమలు, మనమరాళ్లతో కలిసి ఉండాలనే అమ్మల కోరిక కోరికగానే మిగిలిపోతోంది.

అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా…జగమే పలికే శాశ్వాత సత్యమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే.. అవతారపురుషుడైనా ఓ అమ్మకు కొడుకే.. అని అమ్మ గురించి గొప్పగా పాట రాశాడు ఓ కవి. అమ్మ గొప్పతనాన్ని తెలుసుకుని అమ్మ భారం కాదు, బాధ్యతగా గుర్తించాల్సి ఉంటుంది. అమ్మ లేకుంటే జననం లేదనే విషయాన్నిచాలామంది గ్రహించడం లేదు. బరువుగా భావించి వాళ్లను ఊళ్లలో లేదా వయోదికాశ్రమాలకు తరలిస్తున్నారు. చివరి మజిలీలో సంతోషంగా ఉండాలనే వారి కోరిక కోరికగానే మిగిలిపోతోంది. తాను రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేస్తే రెక్కలు వచ్చిన తరువాత ఎగిరిపోతున్నారు. మీ చావు మీరు చావండీ మాదారి మాదే అనే విధంగా వ్యవహరిస్తున్నారు. చదువుకోని వారికి అంతగా లోకజ్ఞానం తెలియదనుకోవచ్చు.. బాగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు, పెద్దపెద్ద వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాధిస్తున్న పెద్దవాళ్లు కూడా తల్లులను భారంగా భావిస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితాలకు అడ్డుగా వస్తున్నారనే నెపంతో వారిని దూరంగా వదిలివేస్తున్నారు. తమ కోసం ఎంత కష్టపడిందనే విషయం ఏమాత్రం గుర్తించుకోవడం లేదు.

పెరుగుతున్న వయోదికాశ్రమాలు..
ఒకప్పుడు వయోదికాశ్రమాలు చాలా తక్కువ. కానీ, నేడు అడుగడుగున వెలుస్తున్నాయి. టెక్నాలజీ పెరిగినట్లే వయోదికాశ్రమాలు కూడా పెరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు పదిలోపే వయోదికాశ్రమాలు ఉండేవి. నేడు జిల్లా వ్యాప్తంగా ఏకంగా 65 వయోదికాశ్రమాలున్నాయి. ఇందులో వెయ్యికి పైగానే అందులో అమ్మలు ఆశ్రమం పొందుతున్నారు. వయోదికాశ్రమలు కూడా రెండురకాలుగా ఉంటాయి. డబ్బులు తీసుకుని అన్నం పెట్టేవి కూడా ఉన్నాయి. మరికొన్ని ఎలాంటి డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా అమ్మలకు మూడు పూటల భోజనం పెడుతున్నారు. వాళ్లు సేవా ధృక్పథంతో అమ్మలకు ఆశ్రమం ఇస్తున్నారు. సగం వరకు కేంద్రాల్లో వ్యాపారం చేస్తున్నారు. డబ్బులున్న పుత్రరత్నాలు డబ్బులిచ్చి వయోదికాశ్రమాల్లో ఉంచుతున్నారు. అప్పుడప్పుడు వెళ్లి చూసి వస్తున్నారు. కొందరైతే ఏడాదికొకసారి కూడా కంటిచూపుకు నోచుకోని వారు కూడా ఉన్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వయోదికాశ్రమాలు ఏర్పాటవుతున్నాయి. కనిపెంచిన అమ్మలను భారంగా కాకుండా బాధ్యతగా భావించి చివరి మజిలీలో సంతోషంగా ఉండేలా చూసుకోవల్సిన బాధ్యత పిల్లలపైన ఎంతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement