Sunday, April 28, 2024

నవతరాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తోంది: మంత్రి తలసాని

రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నవతరాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందుకే హుజురాబాద్ ఉపఎన్నిక కోసం గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారని మంత్రి తలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీలో కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిపై ఈటెల రాజేందర్‌ను పోటీలో నిలిపిన సమయంలో కూడా దామోదర్ రెడ్డిపై ఈటెల గెలిచే అభ్యర్ధేనా అనే చర్చ జరిగిందని తలసాని గుర్తుచేశారు. ఇటీవల నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిపై నోముల భగత్‌ను ప్రకటించిన సమయంలోనూ కొంతమంది ఇలానే అన్నారన్నారు. జానారెడ్డిపై భగత్ ఘనవిజయం సాధించారని మంత్రి తలసాని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపడంతో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని తలసాని స్పష్టం చేశారు.

గత 70 ఏళ్లలో తెలంగాణలో జరగని అభివృద్ది కేసీఆర్ పాలనలో సాగుతుందన్నారు. ఇంటింటికీ నల్లా నీళ్లు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని తలసాని చెప్పారు. తెలంగాణలో బడుగు, బలహీనవర్గాలతో పాటు నవతరాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని తలసాని చెప్పారు. పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గెల్లు శ్రీనివాస్ తల్లిదండ్రులు కూడా ప్రజా సేవలో ఉన్నారని తలసాని గుర్తుచేశారు.

మరోవైపు దళిత బంధుపై కొందరు తల మోకాళ్ళలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని తలసాని మండిపడ్డారు. రాజకీయాల్లో సాంప్రదాయాలు పాటించాలన్నారు. కొందరి భాష వల్ల ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే ప్రజలు చులకన అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను ఉద్దేశించి తలసాని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడుతున్నారని.. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. తమ కంటే బలవంతులు ఉంటారా అని తాము ఆలోచిస్తే మరోలా ఉంటుందని చురకలు అంటించారు. తామూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడగలమని.. కానీ బాధ్యతగా ఉంటున్నామన్నారు. జైలుకు వెళ్లిన వాళ్లే జైలు గురించి మాట్లాడుతున్నారని రేవంత్‌ను ఉద్దేశించి తలసాని ఎద్దేవా చేశారు.

ఈ వార్త కూడా చదవండి: రేవంత్ వాడిన భాష కేసీఆర్‌దే: కాంగ్రెస్ పార్టీ

Advertisement

తాజా వార్తలు

Advertisement