Thursday, May 2, 2024

చదువుల త‌ల్లికి అండ‌గా ‘కేటీఆర్’..

మంత్రి కేటీఆర్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఇట్టే స్పందిస్తూ వుంటారు. ఆ విష‌యంలో తీవ్ర‌త‌ని బ‌ట్టి రెస్పాండ్ అవుతుంటారు. సోష‌ల్ మీడియాలో కూడా కేటీఆర్ యాక్టీవ్ అనే సంగ‌తి తెలిసిందే. కాగా గిరిజ‌న విద్యార్థికి అండ‌గా నిలిచారు కేటీఆర్. ఈ మేరకు ప్రగతి భవన్‌లో శ్రీలతను కలిసిన మంత్రి కేటీఆర్.. ఆమెను అభినందించారు. పేదరికాన్ని ఎదుర్కొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని కితాబిచ్చారు. కాగా, మంత్రి కేటీఆర్‌కు శ్రీలత, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వివ‌రాల్లోకి వెళ్తే.. కోయగూడెం నుంచి ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు దక్కించుకున్న నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థి కారం శ్రీలతకి , ఆమె చదవులకు అయ్యే ఫీజు ఖర్చు, ఇతర ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ కేటీఆర్ భరోసా ఇచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెం కు చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువుల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ వస్తుంది. ఇంటర్మీడియట్‌లో 97 శాతం మార్కులను సాధించింది. నాగర్ కర్నూల్ లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి ఐఐటీ-జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటి వారణాసిలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించింది. పేదరికం ఆమె చదువుకు ఆటంకంగా మారుతోంది. వ్యవసాయ కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు.. శ్రీలత ఉన్నత చదువులకు అయ్యే ఫీజులను చెల్లించే స్థితిలో లేరు. ఆమె చదువును ఆపేసే పరిస్థితి వచ్చింది. ఇంతలో శ్రీలత సమస్య మంత్రి కేటీఆర్ దృష్టికి చేరగా.. ఆయన వెంటనే స్పందించారు. శ్రీలత ఐఐటి విద్యకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. శ్రీలత ఐఐటీ పూర్తయ్యేవరకు ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement