Monday, April 29, 2024

ఆస్తులు క‌న్నా… ర‌క్త సంబంధాలు గొప్ప‌వి

ఆస్తులు క‌న్నా ర‌క్త సంబంధాలు గొప్ప‌వి అని విజయనగరం జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సాయి క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి అన్నారు. చిన్న చిన్న విష‌యాల‌కు గొడ‌వ‌లు ప‌డి జీవితంలో ప్ర‌శాంత‌త‌ను కోల్పోవ‌ద్ద‌ని చెప్పారు. ఆస్తులు క‌న్నా ర‌క్త సంబంధాలు చాలా గొప్ప‌వ‌ని వాటి విష‌యంలో ఎవ‌రూ త‌ప్పిదాలు చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. ఆస్తి త‌గాదాలు, ఇత‌ర గొడ‌వ‌ల‌తో జీవితాల‌ను ఛిన్నాభిన్నం చేసుకోవ‌ద్ద‌న్న జడ్జి.. అంద‌రూ ప్ర‌శాంతంగా చీకూచింతా లేని జీవితాలు గ‌డ‌పాల‌ని హితవు ప‌లికారు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల్ల భాగంగా మంగ‌ళ‌వారం న్యాయ సేవా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని రామ‌వ‌రంలో నిర్వ‌హించిన న్యాయ అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌టంలో అంద‌రూ భాగ‌స్వామ్యం అవ్వాల‌ని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవ‌ల‌ను అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు న్యాయ సేవాధికార సంస్థ తోడ్పాటు అందిస్తుంద‌ని పేర్కొన్నారు. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రూ ముఖ్యంగా మ‌హిళ‌లు వారి హ‌క్కుల గురించి తెలుసుకోవాల‌న్నారు. రాజ్యాంగం మ‌న‌కు క‌ల్పించిన హ‌క్కులు, బాధ్య‌త‌ల గురించి ప్రాథ‌మిక అవగాహ‌న క‌లిగి ఉండాల‌ని చెప్పారు. అంద‌రూ ర‌క్త సంబంధాల‌కు విలువ ఇవ్వాల‌ని, అప్పుడే ప్ర‌శాంతమైన జీవితం గ‌డ‌ప‌వ‌చ్చ‌ని ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. అనంత‌రం న్యాయ సేవ‌ల‌కు సంబంధించిన క‌ర ప‌త్రాన్ని జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement