Friday, May 3, 2024

సీబీఐ అధికారుల‌మంటూ భారీ మోసం : పోలీసుల‌ను ఆశ్ర‌యించిన కుటుంబం

సిబిఐ ఆఫీస‌ర్స్ అంటూ ఇంట్లోకి ప్ర‌వేశించి న‌గ‌లు, న‌గ‌దుని దోచుకున్నారు ఓ ముఠా. వివ‌రాల్లోకి వెళ్తే .. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని నాన‌క్ రామ్ గూడ‌లోని ఓ గేటెడ్ క‌మ్యూనిటీలోని ఓ ప్లాట్ లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. సీబీఐ అధికారుల‌మని న‌లుగురు వ్య‌క్తులు బంగారు ఆభ‌ర‌ణాలు, డైమండ్ సెట్ల‌తో పాటు రూ.2లక్ష‌ల న‌గ‌దుని దోచుకున్నారు. ఈ ఘటనపై రియల్టర్ భార్య భాగ్యలక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నానక్ రామ్ గూడలోని జ‌య‌భేరీ ఆరెంజ్ కౌంటీలోని తన అపార్ట్‌మెంట్‌కు నలుగురు వ్యక్తులు వచ్చారని, వారు తమను తాము సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారని ఆమె చెప్పారు. మీ ఇంట్లో సోదాలు చేసేందుకు తాము వచ్చామని చెప్పారన్నారు.

పోలీసులు కేసు నమోదు చేసుకున్న ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ నలుగురు వ్యక్తులు మారుతీ సుజుకి ఎర్టిగాలో వచ్చారు. ఈ వ్య‌వ‌హారం అంతా మెరుపు వేగంతో జరగడంతో మహిళ ఇది మోసం అని గ్రహించే అవకాశం రాలేదు. అంతేకాదు వచ్చింది నిజంగానే సీబీఐ వాళ్లా.. మోసగాళ్లా.. అని తెలియలేదన్నారు. అచ్చం ప్రొఫెషనల్స్ లాగానే ఉండడంతో ఆ మహిళ తాను మోసపోయానని గ్రహించేందుకు సమయం పట్టింది. తరువాత అది మోసమేనని గ్రహించి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.అయితే ఈ విష‌యం విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. రియల్టర్ భార్య తనింటికి వచ్చి మోసం చేసిన వారిని.. గుర్తుపడతానని చెప్ప‌డంతో వారిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement