Sunday, May 5, 2024

ఈ నెల 24 నుంచి మంజీర కుంభ‌మేళా…శ‌ర‌వేగంగా ఏర్పాట్లు

సంగారెడ్డి – మంజీర కుంభమేళాకు వేళయ్యింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం రాఘవపూర్‌-హుమ్నపూర్‌ గ్రామాల శివారులోని గరుడ గంగ పూర్ణ మంజీర నది కుంభమేళా ఈ నెల 24 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్నది. స్థానిక సిద్ధ సర్వస్వతీదేవి పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో కుంభమేళాను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నది. మహారాష్ట్రలోని బాలాఘాట్‌ పర్వతాల్లో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక గుండా గౌడ్‌గావ్‌ వద్ద తెలంగాణలో మంజీర నది ప్రవేశిస్తున్నది. ఈ నదికి మొదటి సారి పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో 2010లో కుంభమేళా నిర్వహించారు. ఆ తర్వాత 2013, 2018లో కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో కుంభమేళా నిర్వహించారు.

మంజీర నది తీరంలోనే గంగామాత అలయంతోపాటు రెండు కిలోమీటర్ల దూరంలోని పంచవటీ క్షేత్రంలో సిద్ధ సరస్వతీదేవి, షిరిడీ సాయిబాబా, సూర్యభగవాన్‌, భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలను నిర్మించారు. నాలుగోసారి గరుడ గంగ పూర్ణ మంజీర నదికి కుంభమేళాను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సాధుసంతులు, అఘోరాలు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 12 రోజలపాటు జరిగే కుంభమేళాకు ఉత్తర భారతదేశం నుంచి నాగసాధులు, దిగంబరసాధుసంతులు పెద్దఎత్తున తరలిరానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.

భారీగా ఏర్పాట్లు..
కుంభమేళాకు వచ్చే సాధుసంతులు, భక్తులకు అన్నదానం చేసేందుకు ప్రత్యేక షెడ్లను సిద్ధం చేశారు. నాగసాధుసంతులు, భక్తుల కోసం ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా స్నాన ఘట్టాలు, తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకొనేందుకు షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. నదీతీరంలో పోలీసులు, గజ ఈతగాళ్లు, వలంటీర్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు తాగునీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌, మిషన్‌ భగీరథ గ్రిడ్‌ అధికారులు ప్రత్యేక నల్లాలు బిగిస్తున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి, పలుచోట్ల సీసీ కెమెరాలు బిగించి పర్యవేక్షించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ డిపోలతోపాటు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేశారు.

మంజీరలో స్నానం.. పుణ్యఫలం
లోక కల్యాణం కోసమే గురుడ గంగ పూర్ణ మంజీర కుంభమేళాను నిర్వహిస్తున్నాం. గంగానదికి కర్కాటక రాశిలో గురుడు ఉండగా చేసే స్నానం, సింహ రాశిలో గురుడు ఉండగా వేయిసార్లు స్నానం చేస్తే ఏ ఫలమో, కన్యా రాశిలో గురుడు ఉండగా కృష్ణా నదిలో వందసార్లు స్నానం చేస్తే ఏ ఫలం వస్తుందో.. మేష రాశిలో సూర్యుడు ఉండగా మంజీర నదిలో ఒక్కసారి స్నానం చేసినా అంత ఫలం లభిస్తుంది. ఈ కుంభమేళాలో భాగంగా ఈ నెల 24, 25, 27, 30, మే 4, 5వ తేదీల్లో మంజీర నదిలో పుణ్యస్నానాలు చేస్తే అంత పుణ్యఫలం లభిస్తుంది. – కాశీనాథ్‌బాబా, సిద్ధ సరస్వతీదేవి పంచవటి క్షేత్ర పీఠాధిపతి, రాఘవపూర్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement