Friday, May 3, 2024

Manipur: కొండచరియలు విరిగిపడిన ఘటన.. 20కి పెరిగిన మృతుల సంఖ్య

మణిపూర్‌లోని నోనీ జిల్లాలో రైల్వే నిర్మాణ స్థలంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.  దీంతో ఆ శిథిలాల నుండి రెస్క్యూ బృందాలు నిన్న రాత్రి మరో 12 మృతదేహాలను వెలికితీశాయి. ఈ విషాదంలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 20కి చేరుకుందని అధికారులు తెలిపారు. మృతుల్లో 10 మంది టెరిటోరియల్ ఆర్మీకి చెందిన వారున్నట్టు వెల్లడించారు. తూపుల్‌ యార్డ్‌ లోని రైల్వే నిర్మాణ శిబిరం వద్ద బుధ, గురువారాల మధ్య రాత్రి తలెత్తిన  బురద కారణంగా 43 మంది గల్లంతయ్యారు.

కాగా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు,  గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ప్రకటించారు. ఇక.. దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, రాష్ట్ర ఏజెన్సీల సిబ్బంది సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు.

కాగా, ఈ ఘటనలో తమ రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  నిన్న సాయంత్రం తెలిపారు. “మణిపూర్ కొండచరియలు విరిగిపడిన వారిలో డార్జిలింగ్ కొండలకు చెందిన తొమ్మిది మంది జవాన్లు (107 టెరిటోరియల్ ఆర్మీ యూనిట్) ఉన్నారని తెలిసి షాక్ అయ్యాను. మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా” అని బెనర్జీ ట్వీట్ చేశారు.

అంతకుముందు రోజు.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ భారీ కొండచరియలు విరిగిపడటంతో పొరుగు రాష్ట్రానికి చెందిన కనీసం ఒకరు మరణించారని, మరో 16 మంది తప్పిపోయారని చెప్పారు. ఇక… మణిపూర్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో అస్సాంలోని మోరిగావ్‌కు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారని, అయిదుగురు చికిత్స పొందుతున్నారని, 16 మంది గల్లంతయ్యారన్న విషయం తెలిసి విచారిస్తున్నట్లు శర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement