Saturday, May 4, 2024

Smart Tech: వాట్సాప్​లో లేటెస్ట్​ అప్​డేట్స్​.. డిలీట్​ మెస్సేజ్​ అన్​డూ చేయొచ్చు తెలుసా!

వాట్సాప్ అప్​డేట్స్​లో బెస్ట్ ఫీచర్లలో మెసేజ్ డిలీషన్ ఆప్షన్​ ఒకటి. ఎవరైనా పొరపాటున ఒకరికి పంపబోయిన మెసేజ్ మరొకరికి పంపితే దాన్ని ‘Delete For Everyone’ ద్వారా తొలగించొచ్చు. ఈ ఫీచర్ చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కొంతమంది Delete For Everyone నొక్కబోయి Delete For Me అని ప్రెస్​ చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఇంకేమీ చేయడానికి ఉండదు. అయితే.. అట్లాంటి వారి కోసం కూడా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. అదే Undo Message Delete ఫీచర్. ఒకవేళ యాక్సిడెంటల్‌గా Delete For Me నొక్కితే దాన్ని Undo చేసి మళ్లీ Delete For Everyone అని అందరికీ కనిపించకుండా తొలగించే చాన్స్​ ఉంటుంది.

ఈ ఫీచర్ ఇప్పటికే వాట్సాప్​ బీటా వెర్షన్‌లో టెస్టింగ్​లో ఉంది. వాట్సాప్ బీటా 2.22.13.6 వెర్షన్‌లో దీన్ని కొంతమంది యూజర్లు వాడుతున్నారు. అంతేకాకుండా వాట్సాప్​కు పోటీదారు అయిన టెలిగ్రామ్‌లో కూడా ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో పెద్ద వీడియో ఫైల్స్ షేర్ చేసే ఫీచర్స్‌ను కూడా యూజర్స్​కి అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం కేవ‌లం 100ఎంబీ లోపు ఫైల్స్‌ను మాత్ర‌మే పంపించే వెసులుబాటు ఉంది. అయితే కొత్తగా వచ్చిన అప్​డేట్​ ద్వారా 2 జీబీ వ‌ర‌కు ఉండే పెద్ద సైజ్ క‌లిగిన ఫైల్స్‌ను కూడా పంపించుకునే చాన్స్ ఉంటుంది. ఈ ఫీచ‌ర్‌ను మొదట అర్జెంటీనాలో తీసుకొచ్చి ప్ర‌యోగాత్మ‌కంగా పరీక్షిస్తున్నారు. కాగా, ఇండియాలోని యూజర్స్​కి కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ యూజ‌ర్లు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవ‌చ్చు. ప్ర‌స్తుతానికి కొంత‌మంది యూజ‌ర్లకు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్‌ను వినియోగించుకునే అవ‌కాశం ఉంది. మిగిలిన యూజ‌ర్ల‌కు త్వ‌ర‌లో ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement