Wednesday, May 8, 2024

సాగర్ పోరు.. దూకుడు పెంచిన గులాబీ బాస్!

తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటికే ప్రధాన పార్టీల నేతల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రచారంలో దూకుడు పెంచాయి పార్టీలు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్ధులు వినూత్నంగా ప్రచారం చేసున్నారు.

ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు సాగర్ లోనే మకాం వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సైతం ప్రచారానికి సిద్ధమవుతున్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను టీఆర్ఎస్ ఆచరిస్తోంది. దుబ్బాక ఫలితం అనుభవం నుంచి పాఠం నేర్చుకున్న గులాబీ దళం.. సాగర్ సమరాన్ని తేలిగ్గా తీసుకోవద్దని భావిస్తోంది. సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు అన్ని తెప్పించుకున్న సీఎం కేసీఆర్.. నాగార్జునసాగర్‌లో సభ నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు టీఆర్ఎస్‌కి ఓ గుణ పాఠం అని భావిస్తున్న టీఆర్ఎస్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  విజయంతో జోష్ లో ఉంది. అయితే, దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి కంటే..  బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు సానుభూతి ఉండడంతో ప్రజలు ఆయనను గెలిపించారు. ఇప్పుడు ఇదే సీన్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి కలిసి వస్తుందని అంతా భావిస్తున్నారు.

సాగర్ లో జానారెడ్డి రూపంలో కేసీఆర్‌కు సవాల్ విసురుతోంది కాంగ్రెస్. నాగార్జునసాగర్ నియోజకవర్గం జానారెడ్డికి కంచుకోట. అందుకే సీఎం కేసీఆర్ అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి.. ప్రచార సరళిని కేసీఆరే స్వయంగా పరిశీలిస్తున్నారు. సాగర్‌లో సభ ఏర్పాటు చేసే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారు.

దుబ్బాకలో మంత్రి హరీష్‌పైనే భారం వేసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అటువైపు తిరిగి చూడకపోవడంతో సీన్ రివర్స్ అయింది. గ్రేటర్‌ ఫలితాలతో ఖంగుతిన్న టీఆర్ఎస్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహం మార్చింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న తరుణంలో… స్వయంగా సీఎం కేసీఆర్‌ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 14న అనుములలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేసీఆర్‌ సభ కోసం టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆ సభలో సీఎం కేసీఆర్‌ ప్రస్తావించనున్నారు. దీంతో టీఆర్ఎస్ దే గెలుపు అనే సంకేతం ఇతర పార్టీలకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి సభలోనూ విపక్షాలపై విరుచుకుపడే కేసీఆర్.. తాజా సభలో ఎలా వివ్యూహాంలో ఎదరు దాడి చేస్తారో చూడాలి.

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం కారణంగా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల ఏప్రిల్‌ 17న జరుగనుంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల కుమారుడు నోముల భగత్ బరిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement