Monday, May 20, 2024

పార‌ద‌ర్శ‌కంగా సంక్షేమం – కెసిఆర్ నిర్ణ‌యం….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో తలపడుతున్న ప్రతిపక్షాల వ్యూహానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తాజాగా పరిపాలన పటిష్టతపై దృష్టి కేంద్రీకరించారు. సంక్షేమ కార్యక్రమాల్లో చిన్నచిన్న లోటుపాట్లను, లొసుగులను కూడా గోరంతను కొండంతగా చేసి రాజకీయంగా కేసీఆర్‌ సర్కారు ప్రతిష్టను దెబ్బతీయాలన్న ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. నియోజక వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా కొన్ని సందర్భాల్లో స్థానిక అధికారులకు మార్గ నిర్దేశం చేయడం, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రమేయం, జోక్యం ఉండడం పరిపాటే. కానీ, ఇది ఎన్నికల సమయం అయినందు న అలాంటి సందర్భాలు రాజకీయంగా బెడిసికొట్టే అవకాశం ఉన్నందున కేసీఆర్‌ కట్టడి చేశారు. సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపికపై ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం ఉన్న ట్లు తన దృష్టిని వస్తే కఠిన చర్యలు తప్పవం టూ అంతర్గతంగా అల్టిమేటం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంచార్జి ల ద్వారా అధినేత ఈ విషయాన్ని స్పష్టం చేశారు. విపక్షాలు కాచుకు కూర్చున్న తరుణంలో అన్ని కోణాల్లో జాగ్రత్తపడాలంటూ కేడర్‌కు మార్గనిర్ధేశం చేశారు.ఇదే విషయా న్ని జిల్లా కలెక్టర్ల ద్వారా క్షేత్రస్థాయి అధికార యంత్రాంగానికి కూడా సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, నాయకులే కాదు.. పార్టీలో, ప్ర భుత్వంలో ఎంతటి స్థాయి ఉన్నవారైనా సరే రెకమండ్‌ చేసిన అంశాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందేనంటూ అనధికారికంగా హుకుం జారీ చేశారు. అలాంటి సంఘటనలేమైనా ప్రభుత్వం దృష్టికి వస్తే, చర్యలు తప్పవన్న సంకేతాలిచ్చారు.

తాజాగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా ‘దళిత బంధు’ అంశంపై అంతర్గతంగా జరిగిన చర్చను కూడా ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలు రాజకీయ రాద్దాంతం చేసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఒక్కో దళితబంధు లబ్ధిదారుడి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారని, కొన్ని సంఘటన లను ఉటంకిస్తూ అధినేత వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని బట్టి చూస్తే, సంక్షేమ కార్యక్రమా ల్లో అవినీతి జరుగుతున్నట్లేనని కొంత మంది నాయకులు పనిగట్టుకుని ప్రభు త్వంపై ఆరోపణలు చేయడాన్ని సీఎం కేసీఆర్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా కఠిన నిర్ణ యాలు తీసుకోవడం ద్వారా విపక్షాల రాజకీయ రాద్దాంతానికి అవకాశం ఉండదని ఆయన భావిస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతు న్న చిన్నచిన్న లోటుపాట్లను కూడా ఎత్తిచూప డమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్షాల వ్యూహాన్ని దెబ్బకొట్టే ప్రతివ్యూహాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ స్వయం పర్యవేక్షణ మొదలుపెట్టారు. ప్రధానంగా భూ క్రమబద్దీకరణ ప్రక్రియలో ఎమ్మెల్యేల పాత్రకు బ్రేక్‌ వేశారు. గ్రామస్థాయి నుంచి పారదర్శక విధానానికే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ తన వైఖరిని స్పష్టం చేశారు. విధానపరమైన ఈ నిర్ణయాలను బహిరంగంగా ప్రభుత్వం ఎక్కడా ప్రకటించక పోయినప్పటికీ, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులకు సీఎంవో నుంచి అంతర్గత మార్గదర్శకాలు వెలువడినట్లు తెలుస్తోంది. ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ, పేదల సొంతింటికి రూ.3లక్షల నగదు పారితోషికం లాంటి సంక్షేమ పథకాలతో పాటు రాజకీయాలకు అతీతంగా జీవో 58, 89 ద్వారా పేదలకు లబ్ది చేకూర్చాలన్న విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎమ్మెల్యేల పెత్తనానికి బ్రేక్‌..
క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని గత కొద్ది నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్‌ 58, 59ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. వీటి ప్రకారం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న పేదలకు నిబం ధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరిస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఆ దిశగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం కొంతమంది నాయకులకు విస్మయాన్ని కలిగిస్తున్నప్పటికీ, అవేవీ పట్టించుకోకుండా అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటు-న్న నేపథ్యంలో.. వాటిని చక్కదిద్దేందుకు కఠిన నిర్ణయాలు తప్పవన్న సంకేతాలిచ్చారు. అధికార యంత్రాంగానికే సర్వాధికారాలు కట్టబెట్టేలా ముఖ్య మంత్రి నిర్ణయాలు తీసుకోవడంతో ప్రతిపక్షాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలోనే ఎమ్మెల్యేలతో ఎదురయ్యే తలనొప్పిని దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణ దిశగా అడుగులు వేసినట్టు- తెలుస్తోంది.

ఎందుకీ నిర్ణయం?
ప్రభుత్వం బహిరంగంగా చెప్పడం లేదు కానీ అధికార పార్టీకి చెందిన సుమారు 45 మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటు-న్నట్లు అధినేత కేసీఆర్‌ సీక్రెట్‌ సర్వేలో తేలింది. అయితే, వీరితో ఎన్నికల ముందు ఎందుకు తలనొప్పి అనే ఉద్దేశం తో ఉన్నప్పటికీ, రాజకీయ కోణంలో కొంపముంచే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు- ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఎన్నికలకు ముందు ఇతరత్రా ప్రయోజనాలు పేదలకు సకాలంలో అందాలన్న సంకల్పంతో ముఖ్య మంత్రి స్వయం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పారదర్శకంగా చేయా ల్సిన పనిని కూడా విపక్షాలు రాజకీయం చేస్తూ, ఓట్ల కోసం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాన్ని నిలువరించేందుకు ఈ నిర్ణయం తప్పనిసరిగా మారింది. అయితే ఈసారి ఎన్నికల్లో గ-ట్టె-క్కడం అత్యంత సంక్లిష్టంగా కనిపిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్నది
వాస్తవమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తనకున్న అన్ని మార్గాలను ప్రజా సంక్షేమం కోసం వాడుకోవడం ద్వారా ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించాలన్నదే సీఎం కేసీఆర్‌ ముఖ్యోద్దేశంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement