Friday, May 10, 2024

కర్ణాటక నేతలను భయపెట్టిస్తున్న సీడీల రాజకీయం

కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం సీడీలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాసలీలల సీడీల వ్యవహారంతో మంత్రి రమేష్ పొఖ్రియాల్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అధికార బీజేపీతో పాటు విపక్షంలోని కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు చెందిన సీడీలు తమ వద్ద ఉన్నాయని ఓ పార్టీ నేతలు మరో పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం యడ్యూరప్పకు చెందిన సీడీ బీజేపీ ఎమ్మెల్యేల వద్ద ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే బసవనగౌడ యత్నాశ్ తెలిపారు. కొద్దికాలంగా యడ్యూరప్పపై ఆయన విమర్శలు చేస్తూ వస్తుండగా తాజాగా చేసిన సీడీ ఆరోపణ కలకలం రేపుతోంది. కాగా మరో 23 సీడీలు మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద ఉండగా అవసరాన్ని బట్టి వాటిని వాడుకునే ఆస్కారం ఉందని యత్నాశ్ సంకేతాలిచ్చారు.

అటు రాసలీలల వ్యవహారంలో వచ్చిన సీడీతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన రాజకీయ భవిష్యత్‌ను అంధకారం చేసేందుకు కొందరు కుట్ర పన్నారని రాజీనామా చేసిన మాజీ మంత్రి రమేష్ పొఖ్రియాల్ వాపోతున్నారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో ఈ సీడీ సృష్టించారని, వారి పేర్లు ఇప్పుడే బయటపెట్టనని, త్వరలోనే వారి గుట్టు విప్పుతానని స్పష్టం చేశారు. ఈ వాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. ‘రాజకీయాలంటేనే ప్రత్యర్థులపై కక్ష సాధింపు అని, తమపై కుట్ర పన్నుతున్నట్లు తెలిసినా అప్రమత్తం కాకపోవడం అవతలి వారి బలహీనత’ అని వ్యాఖ్యానించారు. ఎదుటివారిని బట్టలు విప్పమని, వేసుకోమని మనం చెప్పగలమా అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement