Sunday, April 28, 2024

Jumping Leaders – వ‌ల‌స నేత‌ల విన్యాసాలు … మండి ప‌డుతున్న శ్రేణులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆడలేక మద్దెల ఓడు… అన్నట్టుంది భాజపాను వీడిన వలస నేతల కథ! కోవర్ట్‌ ఆపరేషన్‌లో భాగంగా కమలదళంలో ప్రవేశించి సాధ్యమైన రీతిలో పార్టీని నష్టపరిచి చల్లగా జారుకున్న వలస నేతల ప్రకటనలతో భాజపా శ్రేణులు మరింత మండిపడుతున్నాయి. తాము భారాస అధినేత కేసీఆర్‌ అప్రజాస్వామిక, నియంతృత్వ, అవినీతి చర్యలకు వ్యతిరేకంగా పార్టీలో చేరామని కొత్తలో ప్రకటించారు. ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత పార్టీని వీడారు. ఇప్పుడేమో అనుకున్న స్థాయిలో భాజపా తెలంగాణలో ఎదగడం లేదని, అవినీతి కేసులని హడావుడి చేస్తోందే కాని చర్యలు తీసకోనందునే పార్టీని వీడినట్టు చెబుతున్నారు! అంటే, పార్టీ విధానాలు, సిద్దాంతాలు, నిబద్దత, నైతికతలకు తాము తిలోదకాలు ఇచ్చేసినట్టు వారే స్వయంగా ప్రకటించు కుంటున్నారన్న మాట! కేవలం వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించడం, కక్షపూరిత వ్యవహారాలకు మాత్రమే తాము రాజకీయాల్లో ఉన్నట్టు చెప్పకనే చెబుతున్నారు! ప్రత్యర్ధి పార్టీ నేతలను అరెస్ట్‌ చేయించడానికి, తమ సొంత పనులను చక్కబెట్టుకోవడానికి మాత్రమే వారు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇట్టే స్పష్టమవుతోంది. కొందరు కోవర్ట్‌ ఆపరేషన్‌లో భాగంగా భాజపాలోకి ప్రవేశిస్తే, మరికొందరు పదవులు, ఇతర లాభాలను ఆశించి భాజపా ఛత్రం నీడలోకి వెళ్లారు. గతంలో కూడా కొందరు ఇదేవిధంగా పలుమార్లు ఎడాపెడా కండువాలను మార్చేసిన సంగతి తెలిసిందే!

ఏ పార్టీ అయినా నిలబడి కలబడాలంటే ఆయా పార్టీల సిద్ధాంత విధానాలకు అనుగుణంగా నేతలంతా శ్రేణులతో మమేకమై ప్రజాపోరాటాలను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుండాలి. అప్పుడే ఆయా పార్టీల పట్ల జనంలో విశ్వసనీయత పెరుగుతుంది. తమ వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీలు మారి ఢిల్లిd చుట్టూ ప్రదక్షిణలు, రాజకీయ పైరవీలు చేస్తుంటే జనంలో మంచి పేరు ఎలా వస్తుందని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.

జనాభిప్రాయంతో సంబంధం లేకుండా తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ, పార్టీ కండువాలను మారుస్తూ వ్యవహరించే నాయకులకు విలువ ఏముంటుందని, ఆధునిక సమాజంలో ఇటువంటి నేతలకు స్థానం లేదని వారంటున్నారు. ఒకవేళ వారు ఏపార్టీలో ఏ పదవిలో ఉన్నా, కొనసాగగలిగినా జనం ఓట్లేస్తారనుకోవడం భ్రమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఓటర్ల తీరు గతంలో వలె లేదని, పార్టీ నచ్చినా అభ్యర్ధి నచ్చకపోతే కచ్చితంగా ఓడిస్తారని పేర్కొంటూ ఇందుకు పలు ఉదాహరణలు చెబుతున్నారు. సొంత పార్టీ అభ్యర్ధి అయనా ఇందుకు మినహాయింపు ఇచ్చే స్థితిలో శ్రేణులు లేవని పరిశీలకులు ఆయా పార్టీలను హెచ్చరిస్తున్నారు.
పార్టీ విధానాలను ప్రచారం చేయకుండా, జనంతో మమేకం కాకుండా, పోరాటాలు నిర్మించకుండా, తాము ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదని ఆరోపించడం గర్హనీయమని భాజపా శ్రేణులు మండిపడుతున్నాయి.

ప్రత్యర్ది పార్టీల నేతలను తమ కక్షపూరిత వ్యవహారాలకు అనుగుణంగా అరెస్టులు చేయలేదని పేర్కొనడం మరింత విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఈ పెద్దమనుషులే పలు సందర్భాల్లో పేర్కొన్న అంశాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడాన్ని వారు తీవ్రంగా తీసుకుంటున్నారు. కోవర్ట్‌ ఆపరేషన్‌ నుంచి జనం దృష్టిని మళ్లించడానికి, తామే కోవర్ట్‌ పాత్ర పోషించిన విషయాన్ని జనం మరచిపోవడానికి ఆయా నేతలు చేస్తున్న ప్రయత్నాలను శ్రేణులు తీవ్రంగా నిరసిస్తున్నాయి. చేసే ఆరోపణలకు చేసిన, చేస్తున్న పనులకు పొంతన ఉండడం లేదన్న విషయాన్ని జనం తెలుసుకున్నారన్న విషయాన్ని వారు గ్రహించాలని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement