Tuesday, April 30, 2024

TPCC: రేవంత్‌ కి షాక్ ఇచ్చిన జగ్గారెడ్డి.. ‘రచ్చబండ’కు దూరం!

యాసంగిలో వ‌రి ధాన్యంపై రాష్ట్ర ప్ర‌భుత్వం అనుసరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సోమవారం ‘రచ్చబండ’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉన్న రైతుల‌ను అంద‌రికీ వ‌రి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం కేసీఆర్.. తన 150 ఎక‌రాల్లో వ‌రి పండిస్తున్నార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ సాగు చేస్తున్న వరిని చూపిస్తానని ప్రకటించారు.

అయితే, రేవంత్ రెడ్డి ఎర్ర‌వల్లిలో ర‌చ్చ‌బండ కార్యాక్ర‌మం నిర్వ‌హించ‌డంపై సొంత పార్టీ నాయ‌కులే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. రేవంత్ ప్రకటనపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మ‌రోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. తాను ర‌చ్చబండ కార్యాక్ర‌మానికి రాను అని స్పష్టం చేశారు. ఎర్రవెల్లి గ్రామంలో రేవంత్‌ రెడ్డి చేపట్టిన ‘రచ్చబండ’కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.

రేవంత్ రెడ్డి ర‌చ్చ‌బండ చేసేది ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ఉందన్న జగ్గారెడ్డి.. జిల్లా నుంచి తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు. త‌న‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కార్యాక్ర‌మం ప్ర‌క‌టించార‌ని మండిపడ్డారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సంబంధించిన ఈ కార్యక్రమం గురించి ఆ జిల్లాలో ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనైన తనతో చర్చించకుండానే రేవంత్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టి ప్రకటించడానికి నిరసనగా ‘రచ్చబండ’కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నానని తెలిపారు.

ర‌చ్చ‌బండకు రాకుంటే.. త‌న గురించి ప్ర‌జ‌లు త‌ప్పుగా అర్థం చేసుకుంటార‌ని అందుకే మీడియా ముందుకు వ‌చ్చాన‌ని తెలిపారు. కార్యక్రమం ప్రకటించే ముందు తనతో చర్చించలేదన్నారు. జిల్లాలో రేవంత్ రెడ్డి ఏదైన కార్యక్రమం తీసుకుంటే.. తమతో చర్చించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పీసీసీ అంటే అందరిని కలుపుకొని పోయే పోస్ట్ అన్న జగ్గారెడ్డి.. అందరిని విడదీసే పోస్ట్ కాదని చురకలంటించారు.  ఇలాంటి కార్యక్రమాలు పీఏసీ మీటింగ్‌లో చర్చించకుండానే ప్రకటిస్తున్నాడని రేవంత్‌పై మండిపడ్డారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు ఇలా ప్రకటించడానికి చాలా బాధగా ఉందని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement