Thursday, May 9, 2024

రాష్ట్రమంతటా ఐటీ.. శరవేగంగా విస్తరిస్తున్న పరిశ్రమ.. స్థానిక యువతకు భారీగా ఉద్యోగావ‌కాశాలు..

తెలంగాణలో ఐటీ పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు విజయవంత మవడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీలు మారుమూల జిల్లాల్లోనూ తమ కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి. అక్కడి యువతకు ఉద్యోగాలిస్తున్నాయి. ఉన్న ఊరును వదిలి హైదరాబాద్‌కు రాకుండానే యువత ఐటీ కంపెనీల్లో ఉద్యోగస్తులుగా మారుతున్నారు. తాజాగా ఆదిలాబాద్‌లో బిజినెస్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఎన్‌డీబీఎస్‌ అనే ఐటీ కంపెనీ అక్కడి యువతకు ఉద్యోగాలిచ్చింది. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా వారికి ఆఫర్‌ లెటర్లను అందించింది. ఇదే విషయంపై ట్విట్టర్‌లో ప్రత్యేకంగా ట్వీట్‌ చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ తెలంగాణలో ఐటీ పరిశ్రమ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు శరవేగంగా విస్తరిస్తోందనడానికి ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీ ప్రారంభమై అక్కడి యువతకు ఉద్యోగాలు రావడమే నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవలే అమెరికాకు చెందిన మరో హెల్త్‌కేర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎక్లాట్‌ కూడా వరంగల్‌, ఖమ్మంలలో మరో రెండు డెలివరీ కేంద్రాలు ప్రారంభించి తెలంగాణలో తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రెండేళ్లలో మరో 1400 మందికి ఉద్యోగాలివ్వనున్నట్లు తెలిపింది.

విస్తరణకు ఐటీ హబ్‌లు దోహదం..

వరంగల్‌, కరీంనగర్‌లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లలో టెక్‌ మహీంద్రా, సైయంట్‌ లాంటి ప్రముఖ ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడి యువతకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కల్పించాయి. ఖమ్మంలో ఐటీ హబ్‌ కూడా ప్రారంభమై పలు ఐటీ కంపెనీలకు నెలవుగా మారింది. సిద్ధిపేటలోనూ ఐటీ హబ్‌ నిర్మాణంలో ఉంది. ఇటీవలే మంత్రి కేటీఆర్‌ నల్గొండలో ఐటీ హబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. త్వరలో మరిన్ని జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్‌లు నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సకల మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌ల కారణంగానే ఆయా నగరాలకు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. కొవిడ్‌తో మారిన పరిస్థితులతో అన్ని రంగాల్లో వెల్లువెత్తిన డిజిటల్‌ విప్లవంతో ఐటీ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలు, మార్కెట్‌ లభించాయి. దీంతో గడిచిన ఏడాది ఐటీ కంపెనీలు 20 శాతానికి పైగా ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. దీంతో కంపెనీలు ఇదే స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ముందుకువచ్చాయి.

పెరగనున్న పెట్టుబడులు… ప్రారంభమవనున్న కొత్త క్యాంపస్‌లు…

కొత్తగా రాష్ట్రంలోకి వచ్చే ఐటీ రంగ పెట్టుబడులు భారీగా పెరగనున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. డిజిటల్‌ రంగంలో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు పెరుగుతండడంతో అవి కొత్త క్యాంపస్‌లు ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. ఐటీలో ముఖ్యంగా కొత్తగా వస్తున్న డిజిటల్‌ ఉప రంగాలైన ఏఐ, ఎంఎల్‌, సాస్‌, గేమింగ్‌, ఫిన్‌టెక్‌ వంటి వాటిలో హైదరాబాద్‌ యువత నైపుణ్యాలు కలిగి ఉంటున్నందున కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రాష్ట్రమంతటా ఐటీ, హైదరాబాద్‌ నగరంలో ఐటీ గ్రిడ్‌ పాలసీలు, వాటిలో భాగంగా ఇస్తున్న రాయితీలు కూడా భవిష్యత్తులో ఈ రంగంలో పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీలతో తెలంగాణలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తుండడంతో రానున్న రోజుల్లో తెలంగాణలో సంవత్సరానికి కొత్తగా వచ్చే ఐటీ ఉద్యోగాల సంఖ్య ప్రస్తుతమున్న 30 వేల నుంచి ఏకంగా 50 వేలకు చేరుకుంటుందని హైసియా, నాస్కామ్‌ వంటి ఐటీ కంపెనీల అసోసియేషన్‌లు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఐటీ రంగం స్థిరమైన వృద్ధి రేటు కనబరుస్తోందని నీతిఆయోగ్‌ ఇటీవల వెల్లడించిన అర్ధ్‌నీతితో పాటు ఇతర సంస్థల నివేదికలు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement