Monday, April 29, 2024

జగన్ కు ఝలక్ ఇచ్చిన కేసీఆర్!

సైబరాబాద్ కమిషనర్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రను నియామితులైయ్యారు. ఏపీకి వెళ్తారని భావిస్తున్న స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నియామకంతో ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ప్రయత్నించారు. ఇందుకోసం కేంద్రంతోనూ సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో గతంలో ఓసారి సీఎం జగన్ కు స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేకంగా కలిశారు కూడా. ఆయనకు ఇంటెలిజెన్స్ బాధ్యతలు కట్టబెట్టాలనుకున్నారు. అయితే, స్టీఫెన్ ఏపీకి వెళ్లేందుకు సిద్ధమైన వేళ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆశలపై తెలంగాణ సీఎం కేసీఆర్ నీళ్లు చల్లారు.

నిజానికి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అనుమతి అవసరం తప్పనిసరి. దీంతో ఈ అంశంపై సీఎం జగన్ కేంద్రంతో మంతనాలు జరిపి ఒప్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ ఆయన మాట్లాడారు. జగన్ విజ్ఞప్తి మేరకు స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రవీంద్రకు నిఘా విభాగం బాధ్యతలు అప్పగించాలని జగన్ భావించారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపేందుకు అంగీకరించింది. ఆయనను డిప్యుటేషన్‌పై పంపించేందుకు సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారు. అనంతరం స్టీఫెన్‌ రవీంద్ర సెలవుపై వెళ్లారు. డీవోపీటీ ఆమోదం లభించిన వెంటనే ఆయన ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. అయితే, కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆయన తెలంగాణలోనే ఉండిపోయారు.

ఇటీవల తెలంగాణ, ఏపీ మధ్య జల జగడం తారా స్థాయికి చేరింది. ఇరురాష్ట్రా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గతంలో మాదిరి ఇప్పుడు రాష్ట్రల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత లేదు. జల వివాదం కొనసాగుతున్న క్రమంలోనే స్టీఫెన్ ను ఏపీకి పంపకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టీఫెన్ ను సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో రవీంద్రపై ఏపీ సీఎం జగన్‌ పెట్టుకున్న ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement