Tuesday, May 21, 2024

కేసీఆర్‌లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష నేడు రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ళు అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లు అని రేవంత్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌కు 20 నెలల భయం పట్టుకుందని.. సీఎం అయిన తర్వాత తొలిసారిగా కేసీఆర్‌లో భయం కనిపిస్తుందన్నారు. అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం తరువాత పార్టీలో సీనియర్లు ఎవరు బ్రీఫ్ చేయలేదని.. ఆఖరుకు కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్ మీడియా సమావేశం పెట్టారని రేవంత్ వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ పార్టీలో ఉద్దండులు మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారని.. భవిష్యత్‌లో టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు కేసీఆర్ పక్కన కూర్చోడానికి భయపడతారని రేవంత్ జోస్యం చెప్పారు. కేసీఆర్ ఒంటరి వాడు అయ్యాడని.. కేసీఆర్ ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఆ భ్రమల్లో నుంచి జనాలు ఇప్పుడు బయటకు వస్తున్నారన్నారు.
తాను రాత్రి దళిత వాడలో పడుకున్న ఇళ్ళు 35 సంవత్సరాల క్రితం నాటి ఇందిరమ్మ ఇళ్ళు అని అన్నారు. మూడు చింతల పల్లి గ్రామానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు.. మూడు చింతలపల్లిలో కేసీఆర్ ఫౌంహౌస్ కోసం రోడ్డును రెండేళ్ల క్రితం 6 ఫీట్లు పెంచి వేశారని.. దీంతో ఇందిరమ్మ ఇళ్ళు కిందకి అయ్యి రోడ్డు పైకి అయిందన్నారు. స్థానికులకు డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. వర్షం పడగానే ఇక్కడి ఇళ్ళు చెరువులా మారుతున్నాయన్నారు. దళిత బంధు అందరికీ ఇవ్వాలనేది తమ డిమాండ్ అని, బడ్జెట్ సరిపోకపోతే సెక్రటేరియట్ ,అసెంబ్లీ అమ్ముదామని.. ఎక్కడ సంతకం పెట్టాలో కేసీఆర్ చెప్తే పెడ్తామన్నారు. జీహెచ్ఎంసీలో అందరికీ రూ.10వేల సహాయం ఇవ్వని కేసీఆర్.. దళితులందరికీ దళితబంధు ఇస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని రేవంత్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement