Sunday, April 28, 2024

వైద్య విద్య భారం తగ్గితేనే వలసలకు చెక!

ఏ దేశం అభివృద్ధికైనా పునాదులు విద్య, వైద్య రంగాలు. ముఖ్యంగా యూరప్‌ దేశాలు, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌, ఇజ్రాయెల్‌, తైవాన్‌, వియత్నాం, క్యూబా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలు అనేక రంగాల్లో మన కంటే, ఆ మాటకు వస్తే మిగిలిన దేశాలు కంటే ముందంజలో ఉండటానికి ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడమే. అదే మన దేశంలోనైతే… ఈ రంగాలకు వెచ్చిస్తున్న మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తిలో 3 శాతం లోపే. వైద్య రంగానికి అయితే మరీ తక్కువగా 1.82 శాతం నిధులనే బడ్జెట్లో కేటాయిస్తున్నారు. అందువల్లనే సంపన్నులు, ఉన్నత మధ్య తరగతి ప్రజలు వైద్య విద్య, మరెన్నో నూతన కోర్సులు చదవుటానికి విదేశీ బాట పడుతున్నారు. మేధోవలసలు పెరుగుతున్నాయి. మనదేశంలో మొత్తం వైద్య సీట్లు 90,825. వీటిలో ప్రభుత్వ కళాశాలలో 43 శాతం పైచిలుకు సీట్లు ఉండగా, మిగిలిన సుమారు సగం పైబడి సీట్లు ప్రైవేటు కళాశాలల్లో ఉండటంవల్ల వైద్య విద్య సామాన్యులకు అందుబాటులో లేదు. గత మూడు దశాబ్దాలుగా వైద్య వృత్తి చేపట్టేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. సొంత ఇల్లు ఊర్లు వదిలి పట్టణాలు నగరాలకు మకాంలు మార్చి/ కాలేజీ హాస్టల్ చేర్పించి చదివిస్తున్న పరిస్థితి ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నది.

ప్రభుత్వం రంగంలో వైద్య కళాశాలలు సీట్లు తక్కువ ఉండటం, అదే సమయంలో భారత్‌ దేశంలో ఉన్న సుమారు 261 ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్లు కొనలేక, ఫీజులు కట్టలేక మన దేశం నుంచి ప్రతీ సంవత్సరం వేల సంఖ్యలో చైనా, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌, రష్యా వంటి దేశాలకు వైద్య విద్య కోసం వెళ్తున్నారు. తక్కువ ఫీజు తీసుకుంటున్న ఉక్రెయిన్‌, చైనా వంటి దేశాలకు వెళ్లి, కనిష్ఠం 20 లక్షల నుంచి 50 లక్షలలోపు ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఉక్రెయిన్‌ వెళ్లి వేల మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంతో మన మనదేశం నుంచి వెళ్లిన విద్యార్థులను స్వదేశం తీసుకుని రావడానికి ”ఆపరేషన్‌ గంగా” పేరుతో తీవ్రంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కర్ణాటకు చెందిన వైద్య విద్యార్థి ‘నవీన్‌ శేఖరప్ప’ మరణం అందరి మనసులను కలిచివేసింది. మనదేశంలో ప్రభుత్వం, ప్రైవేటు వైద్య కళాశాలలు మొత్తం 533 మాత్రమే. సుమారు 135 కోట్ల మంది ఉన్న భారతదేశంలో కేవలం 90825 సీట్లు మాత్రమే ఉండటం, అందులో ఎక్కువ సీట్లు ప్రైవేటు కళాశాలల్లో ఉండటం ఎంతవరకూ సమంజసం…? కనీసం ఇప్పుడైనా ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కనీసం 1,50,000 సీట్లు ఉండేటట్లు, అందులో ఎక్కువ సీట్లు ప్రభుత్వ రంగంలో ఉండేటట్లు చూడాలి. వైద్య రంగానికి ఎక్కువ శాతం జీడీపీలో కనీసం 3 శాతం పైబడి నిధులు మంజూరు చేయాలి.

నీట్‌ పరీక్షలో క్వాలిఫై అయిన వారిలో కేవలం 10 శాతం మందికే సీట్లు లభిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం 16 లక్షల మంది నీట్‌ పరీక్ష రాస్తుండగా, వారిలో 8,70,000 పైబడి క్వాలిఫై అవుతున్నారు. వీరిలో సీట్లు దొరక్క, తక్కువ ఫీజులు తీసుకుని వైద్య విద్య అందిస్తున్న విదేశీ కళాశాలలకు… ఉక్రెయిన్‌ వంటి దేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. విదేశాల్లో వైద్య చదువులో ఉత్తీర్ణులైన వారు ఇక్కడ ఎఫ్‌.ఎం.జి.ఈ లో కేవలం 17 నుంచి 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అనగా ఇటువంటి విద్యార్థులు ప్రమాణాలు చాలా నాసిరకం అని తెలియవచ్చింది. రష్యాలో చదివిన వారు 13 శాతం, ఉక్రెయిన్‌, చైనా దేశాల్లో చదివిన వారు 12 శాతం మాత్రమే ఈ ‘ఎఫ్‌ ఎం జి ఈ’ పరీక్ష ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఉక్రెయిన్‌, చైనా దేశాల్లో చదువులు ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో లేవు అని బహిర్గతం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే, వైద్య విద్య మనదేశంలో బాగుంది అని భావించవలసి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ.ఓ) ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్‌ ఉండాలి. కానీ మనదేశంలో 1456 మందికి ఒక ఎంబీబీఎస్‌ డాక్టర్‌ మాత్రమే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అనగా 80 శాతం మంది పట్టణాలు నగరాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో నేటికీ సరైన వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటులో లేక చాలామంది అవస్థలు పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. కనుక ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలను తెరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement