Thursday, May 2, 2024

Spl Story: అధినేత‌ కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశిస్తే.. వైరా నుండి బరిలోకి జీవన్‌ సై!

విలక్షణ రాజకీయాలకు నెలవై, చైతన్యవంతమైన ప్రజలున్న నియోజకవర్గంగా వైరా పేరుగాంచింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడిన వైరా నియోజకవర్గం, ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా ఫలితాలనిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రతి ఎన్నికల్లోనూ నూతన అభ్యర్థిని ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. విభిన్నమైన ప్రజాతీర్పుతో రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గం పేరు మారుమోగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి పలువురు పోటీలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నప్పటికీ, నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో నిర్ణయించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. అయితే గత ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి, విజయం సాధించిన లావుడ్యా రాములు నాయక్‌ తనయుడు జీవన్‌లాల్‌ పోటీలో నిలవాలని బంజారా జాతి సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.

ఆంధ్రప్రభ బ్యూరో, ఖమ్మం రూరల్ : విలక్షణ ఓటర్‌ తీర్పుతో అందరి దృష్టి ని ఆకర్శించే వైరా నియోజకవర్గం నుంచి పోటీలో నిలవాలని ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారి గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన లావుడ్యా జీవన్‌ లాల్‌పై బంజారా జాతి ప్రజలు ఒత్తిడి తీసుకు వస్తున్నారు. హైదరాబాద్‌లో ఇన్‌కం ట్యాక్స్‌ అడిషనల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఇటీవల కమిషనర్‌గా ప్రమోషన్‌ పొందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనను మర్యాద పూర్వకంగా కలిసిన పలువురు యువకులు, బంజారా సంఘాల నాయకులు వైరా నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణలో బలమైన జాతిగా ఎస్టీ లంబాడి తెగ ఉందని, ఆ స్థాయిలో తగిన అవకాశాలు బంజారా జాతి యువతకు దక్కడం లేదని, దానికోసం జీవన్‌లాల్‌ లాంటి వారు చట్ట సభల్లో అడుగుపెట్టి పోరాడాలని ఉస్మానియా యూనివర్సిటీ బంజారా యూత్‌ కోరుతోంది. బీసీ సామాజిక వర్గం, రకరకాల కులాలుగా విడిపోవడం ఎస్సీ సామాజికవర్గం, 2 వర్గాలుగా విడిపోయి ఉండటం వలన ప్రస్తుతం తెలంగాణలో బంజారా జాతి బలమైన సామాజికవర్గంగా ఎదిగిందని వారు జీవన్‌లాల్‌ను ఒప్పించేందుకు సవివరంగా వివరించినట్లు తెలుస్తోంది. ఐఆర్‌ఎస్‌ అధికారిగా మంచి పేరున్నా, సమాజ సేవ చేస్తున్నా, జాతికి మేలు జరగాలంటే చట్టసభల్లోకి ఖచ్చితంగా వస్తేనే బాగుంటుందని బంజారా జాతి యువత బలంగా కోరుతోంది. 10 శాతం రిజర్వేషన్‌ దక్కాలన్నా, బంజార యువతకు రాజకీయ అవకాశాలు పెరగాలన్నా, లంబాడి తండాల జీవన ప్రమాణాలు పెరగాలన్నా జీవన్‌లాల్‌ లాంటి చురుకైన మనిషి అవసరం ఉందని వారు ముక్తకంఠంతో కోరినట్లు సమాచారం.

- Advertisement -

సామాజిక కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్న జీవన్‌లాల్‌
అటు ఐఆర్‌ఎస్‌ అధికారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జీవన్‌లాల్‌, పలు ఎన్‌జీవో సంఘాలు నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకొంటున్నారు. బంజారా జాతి అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న ఆయన, జంజారా జాతి బిడ్డల విద్యకోసం, అభివృద్ధి కోసం, బంజార మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేయడంతో పాటు, ఎన్‌జీవోల ఆధ్వర్యంలో తన వంతు భాగస్వామి కావడంతో పాటు, సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద
సేవలతో లావుడ్యా జీవన్‌లాల్‌ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

తండ్రి స్థానంలో పోటీ కి తనయుడు
వైరా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి, ప్రజా మద్దతుతో విజయం సాధించిన లావుడ్యా రాములు నాయక్‌ స్థానంలో జీవన్‌లాల్‌ బరిలో నిలవాలని పలువురు కోరుతున్నారు. ఉన్నత విద్యావంతుడు కావడం, ఆర్థికంగా స్థితిమంతుడు కావడం జీవన్‌లాల్‌కు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలోనే బంజారా జాతి ప్రతినిధులు, జీవన్‌లాల్‌పై ఒత్తిడి తీసుకు వస్తుండటం గమనార్హం.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ఆదేశిస్తేనే.?
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల మద్దతు కూడగట్టుకొని తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన తెరాస పార్టీ తరుపున పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, యువనేత మంత్రి కేటీఆర్‌లు ఆదేశిస్తే పోటీకి సిద్ధమని లావుడ్యా జీవన్‌ లాల్‌ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలిసింది. తనను కలిసిన బంజారా జాతి ప్రతినిధులతోనూ ఆయన సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. దీంతో రాములు నాయక్‌ రాజకీయ వారసుడిగా వైరా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement