Saturday, April 27, 2024

నిషేధం అంటూ విధించాల్సి వస్తే, ఫస్ట్​ ఆర్​ఎస్​ఎస్​ పైనే ఉండాలి.. సీపీఎం నేత కీలక వ్యాఖ్యలు!

దేశంలో అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్న కారణంగా పీఎఫ్​ఐ (పాపులర్​​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా) కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై ఎన్​ఐఏ దాడులు చేస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు సపోర్ట్​ చేస్తున్నారన్న ఆరోపణలపై 15 రాష్ట్రాల్లోని 93 చోట్ల NIA నేతృత్వంలోని బృందాలు వారం రోజులుగా దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో చాలామందిని అరెస్టు కూడా చేశారు. అయితే.. ఇప్పుడు PFIపై నిషేధం విధించాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేరళ సీపీఐ(ఎం) లీడర్, రాష్ట్ర కార్యదర్శి​ గోవిందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఆందోళనలకు కారణమవుతున్న ఆర్​ఎస్​ఎస్​ని తొలుత బ్యాన్​ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు  చేసిన ఎన్​ఐఏ(నేషనల్​ ఇన్విస్టెగేషన్​ ఏజెన్సీ) స్కానర్​లోకి కేరళ చేరింది. ఇక్కడి నుంచి 22 మంది పీఎఫ్​ఐ లీడర్లను జాతీయ దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఐఏ, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రాష్ట్రాల పోలీసు బలగాలు అరెస్టు చేశాయి. అయితే.. కేరళ ఇప్పుడు తీవ్రవాదులకు అడ్డాగా మారిందని, టెర్రరిస్టుల హాట్​స్పాట్​గా ఉందని.. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రజల జీవితం అంత సేఫ్​గా లేదని ఆరోపణలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.  కాగా, జేపీ నడ్డా ఆరోపించిన ఒక రోజు తర్వాత మరో ప్రకటన కూడా వినిపించింది.

పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా (పీఎఫ్​ఐ)ని ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని జేపీ నడ్డా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని కేంద్రం యోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి గోవిందన్​ ఇవ్వాల (మంగళవారం) చేసిన కామెంట్స్​ కీలకంగా మారాయి.

తీవ్రవాద సంస్థ లేదా మతోన్మాద శక్తిపై నిషేధం విధించడం వల్ల తమ కార్యకలాపాలకు ముగింపు ఉండబోదని, అలాంటి చర్య తీసుకోవాల్సి వస్తే ముందు ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాలన్నారు గోవిందన్​. మత విద్వేషాలను రెచ్చగొట్టే  ఒక సంస్థను నిషేధించాలంటే అది RSS అయి ఉండాలి. మతపరమైన కార్యకలాపాలను నిర్వహించే ప్రధాన సంస్థ ఇది. దానిపై నిషేధం విధించగలరా? తీవ్రవాద సంస్థను నిషేధించడం వల్ల సమస్యకు పరిష్కారం కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ను గతంలో నిషేధించారు. సీపీఐపై కూడా నిషేధం విధించారు అని ఆయన తెలిపారు.

- Advertisement -

ఒక సంస్థను నిషేధించడం వలన దాని భావజాలం అంతం కాదని, వారు కొత్త పేరుతో లేదా గుర్తింపుతో మళ్లీ ప్రజల్లోకి వస్తారన్నారు. అలాంటి గ్రూపులపై ప్రజలకు అవగాహన కల్పించి, అక్రమాలకు పాల్పడినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని గోవిందన్​ చెప్పారు. కాగా, 1950లో సీపీఐపై నిషేధం, స్వాతంత్య్రానికి ముందు, అనంతర కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించిన విషయాన్ని గోవిందన్​ ప్రస్తావించారు.

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, సంఘ్ పరివార్ ప్రస్తుతం పీఎఫ్‌ఐపై నిషేధం కోరుతున్నాయని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ అన్నారు. కనుక మత శక్తులను నిషేధించాలంటే ఆర్‌ఎస్‌ఎస్ మొదటిదని, కానీ దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అలా జరగడం లేదన్నారు. రెండు మతోన్మాద శక్తులు ఒకదానికొకటి తలపడినప్పుడు అవి మరింత బలపడతాయని, అది ఆర్‌ఎస్‌ఎస్‌ అయినా, మైనారిటీ వర్గమైనా “ఇప్పుడు జరుగుతోంది” అదేనన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి వామపక్ష ఫ్రంట్ అలాంటి సంస్థలతో చేతులు కలిపిందా? అని విలేకరులు ప్రశ్నిస్తే.. దానికి ఆయన ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా వందలాది మంది నాయకులను అరెస్టు చేసి, కార్యాలయాలపై దాడులు చేసిన పీఎఫ్‌ఐ, సెప్టెంబర్ 23న కేరళలో హర్తాళ్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా దాని కార్యకర్తలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు. బస్సులు, ప్రజా ఆస్తులు.. సాధారణ వ్యక్తులపై కూడా దాడులకు పాల్పడ్డారు.

సెప్టెంబర్ 23న జరిగిన దానికి సంబంధించి గోవిందన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, వామపక్షాలు హర్తాళ్లకు వ్యతిరేకం కాదని, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. అయితే.. ఆందోళనల పేరుతో హింస, ఆస్తుల విధ్వంసానికి తాము అనుకూలం కాదని తెలిపారు. హర్తాళ్ సందర్భంగా హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. హర్తాళ్ పేరుతో బస్సులను ధ్వంసం చేయడం, ప్రయాణికులపై దాడులు చేయడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం కరెక్ట్​ కాదన్నారు.  దీనిలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement