Monday, March 25, 2024

Telangana: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కిషన్​రెడ్డిపై ఈడీ ఫోకస్​.. ఫెమా చట్టం ఉల్లంఘనపై కేసు నమోదు

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించిన కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ప్రశ్నించింది. అధికార పార్టీ ఎమ్మెల్యే హైదరాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతీయ కార్యాలయంలో ఈడీ అధికారుల ఎదుట ఇవ్వాల హాజరయ్యారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కూడా వ్యవహరిస్తున్నారు.

ఎమ్మెల్యే కిషన్​రెడ్డి ఫెమా చట్టం ఉల్లంఘించినందుకు ED కేసు నమోదు చేసింది. విచారణకు హాజరు కావాల్సిందిగా సోమవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు టార్గెట్​ చేసినట్టు తెలుస్తోంది. అతని బ్యాంకు లావాదేవీల గురించి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించినట్లు సమాచారం. ఇక.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ ముఖ్యనేతల్లో కిషన్‌రెడ్డి యాక్టివ్​ రోల్​ పోషిస్తున్నారు.

కాగా, కిషన్‌రెడ్డిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మల్​రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కిషన్‌రెడ్డి అక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. దళితులు, పేదల భూములను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆక్రమించుకుని కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించారని మల్​రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. కిషన్ రెడ్డి కూడా కాసినోలు ఆడుతున్నారని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement