Saturday, May 4, 2024

నాడు ఆబ్కారీ సీఐగా, నేడు ఆపద తీర్చే అధికారిగా.. బూర్గంపాడుకు ఐఏఎస్‌ అధికారి హనుమంతరావు రాక

ప్రభ న్యూస్‌ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం : విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై, వారితో బంధం పెనవేసుకుంటే ఎప్పటికీ మరచి పోలేరని నిరూపించే ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో సాక్షాత్కరించింది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.హనుమంతరావు వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు బూర్గంపాడుకు విచ్చేశారు. సాధారణంగా వరదల సమయంలో అధికారులు ఎవరు వచ్చినా, ప్రజలు చుట్టుముట్టి సమస్యలపై రాద్ధాంతం చేయడం జరుగుతుంది. కాని అందుకు భిన్నంగా అక్కడి ప్రజలు వ్యవహరించడం చూసి స్థానిక అధికారులు అవాక్కయ్యారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఒకప్పటి నియోజకవర్గ కేంద్రమైన బూర్గంపాడులో మాత్రమే అబ్కారీ పోలీస్‌ స్టే షన్‌ ఉండేది. 2000 – 2001 ప్రాంతంలో ఆ స్టే షన్‌కు సీఐగా ఎం.హనుమంతరావు విధులు నిర్వహించారు. ఆ కాలంలో నాటు సారాతో మరణాలు అనేకం సంభవిస్తుండటంతో పాటు, నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగేవి. దీంతో ఆయన నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు, నాటుసారా అమ్మకాలపై ఉక్కుపాదం మోపారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసిన కరకగూడెం పరిసర గ్రామమైన భట్టుపల్లిలో గంజాయి సాగును అడ్డుకొని ధ్వంసం చేయడం ద్వారా ప్రజల మన్ననలు పొందారు.

పెద్దఎత్తున రాజకీయ దుమారం లేపిన ఈ విషయంలో ఆయన తనదైన శైలిలో చురుగ్గా వ్యవహరించారు. ఇలా పలు చర్యల ద్వారా మహిళలు, ప్రజానాయకులకు సుపరిచితుడైన హనుమంతరావు, ఆ తరువాత గ్రూప్‌ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి, గ్రూప్‌ 1 అధికారిగా నియమితులై, అంచెలంచెలుగా ఎదుగుతూ కలెక్టర్‌ అయ్యారు. సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి జిల్లాను ముంచెత్తిన వరదల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించగా, ఆయన బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర పునరావాస కేంద్రాన్ని శనివారం సందర్శించారు.

ఆపదలో ఉన్నా.. ఆత్మీయతను మరవని ప్రజలు
వారం రోజుల పాటు వరద బీభత్సంతో ఎటునుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని ఆందోళనలో ఉన్న బూర్గంపాడు ప్రజలు, తమ ఆపదను, ఆవేదనను మరచిపోయి ప్రత్యేకాధికారిగా విచ్చేసిన హనుమంతరావును చూసి, దాదాపు పాతికేళ్ల అనంతరం కలిసినప్పటికీ ఆత్మీయతను చాటారు. చూసి ఎన్నాళ్లై ందంటూ కుశలప్రశ్నలు సంధించారు. వారందరితో అంతే ఆప్యాయంగా మాట్లాడిన హనుమంతరావు, వారి ఆదరణకు తగినట్లుగానే స్పందించారు. వరదతో వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటువారిని ప్రభుత్వం ఆదుకుంటుందంటూ ఆయన భరోసా కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement