Monday, April 29, 2024

హైఅలర్ట్‌: గ్రామాల్లో ముమ్మరంగా శానిటేషన్‌ డ్రైవ్‌.. పర్యవేక్షిస్తున్న మంత్రి ఎర్రబెల్లి, కమిషనర్‌ హనుమంతరావు

తెలంగాణ రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబ లకుండా గ్రామపంచాయతీల పరిధిలో ముమ్మరంగా శానిటేషన్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో కదిలిన పంచాయతీరాజ్‌ శాఖ ఆయాపనులను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు కుదిపేస్తున్న సమయంలో అంటురోగాలు ప్రబలే ప్రమాదముండటంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 13వేల పైచిలుకు గ్రామ పంచాయతీల పరిధిలో శానిటేషన్‌ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూనే వరదలతో పాడైన పంచాయతీరాజ్‌ శాఖ రహదారులను పునరుద్ధరిస్తున్నారు. ఈ మేరకు ఆయా పనులను పంచాయతీరాజ్‌ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కమిషనర్‌ ఎం.హనుమంతరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ప్రభ న్యూస్‌, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం గత వారం రోజులుగా కురిసిన వర్షాలతో అతలాకుతలమైంది. రాష్ట్ర ంలో ఎన్నడూ లేని స్థాయిలో వరదలు సంభవించాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఇంతస్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారి కావడంతో పాటు, రాష్ట్ర అధికార యంత్రాంగం, ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి, ప్రత్యామ్నాయచర్యలు చేపట్టడం గమనార్హం. అయితే అన్ని పల్లెలు, దాదాపు వరద ముంపులో ఉండటం, వర్షాలతో అంటువ్యాధులు ప్రబ లే ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు చర్యలకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచనలతో కదిలిన పంచాయతీ రాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 13వేల పైచిలుకు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టింది.

అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఇప్పటికే బ్లిచింగ్‌, ఫాగింగ్‌, నిల్వ నీటిని తొలగించడం, కాలువల నుంచి వరద నీరు సాఫీగా వెళ్లిపోయేలా పలు చర్యలు చేపట్టింది. ప్రతిరోజు శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టంతో పాటు దోమలు వృద్ధి చెందకుండా పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అంతేకాకుండా దోమల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను సైతం స్థానిక వైద్యాధికారులతో కలిసి చేపట్టడం గమనార్హం. నిధులతో సంబంధం లేకుండా ప్రజలు రోగాల బారిన పడకూడదన్న లక్ష్యంతో చేపట్టిన శానిటేషన్‌ పనులను ఆ శాఖ కార్యదర్శి ఎం.హనుమంతరావు స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో సిబ్బంది సైతం ఉత్సాహంగా పనిచేస్తున్నారు. సిబ్బంది సరిపడా లేని చోట్ల తాత్కాలిక పద్ధతుల్లో సైతం సిబ్బందిని సమకూర్చుకొని శానిటేషన్‌ పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా, మండల స్థాయి అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ శానిటేషన్‌ డ్రైవ్‌ పక్కాగా జరిగేలా ఆ శాఖ కమిషనర్‌ చొరవ చూపుతున్నారు. ఇప్పటికే అన్ని పంచాయతీల్లోనూ బ్లిdచింగ్‌ను పెద్ద మొత్తంలో నిల్వ చేసినట్లు తెలుస్తుండగా, పాగింగ్‌ తదితర పనులను ముమ్మరంగా చేపట్టాలని నిర్ణయించిన అధికార యంత్రాంగం ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి అందుకనుగుణంగా ముందుకు సాగుతోంది.

పల్లె ప్రగతితో మెరుగైన పల్లెలు
గత జూన్‌ 3 నుంచి 18 వరకు నిర్వహించిన ఐదోవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామాల్లో పల్లె ప్రగతి కార్య‌క్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దీంతో ఇం త భారీస్థాయిలో వర్షాలు, వరదలు సంభవించినప్పటికీ పల్లెల్లో డెంగ్యూ వంటి వ్యాధులు దరి చేరలేదని, సరిగా నెలరోజుల క్రితం ప్రభుత్వం ముందుచూపుతో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం ఎంతగానో దోహదపడిందని పలు గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు పేర్కొంటున్నారు. వర్షాలతో అనేక పల్లెల్లో చేపట్టిన అనేక పనులు సక్సెస్‌ అయ్యాయని, పిచ్చి మొక్కల తొలగింపు, డ్రైనేజీల్లోని సిల్ట్‌ తొలగింపు, గుంతల్లో నీరు నిల్వకుండా చేపట్టిన ప్రయత్నంతో చాలావరకు సమస్యలు తొలగి పోయాయని వారు పేర్కొంటున్నారు.

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతోనే పరుగులు : ఎం.హనుమంతరావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్


భారీ వర్షాల అనంతరం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఎం. హనుమంతరావు తెలిపారు. వరద సహాయక చర్యల పర్యవేక్షణ నిమిత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన ఆయనను ఆంధ్రప్రభ పలకరించగా ఆయన పైవిధంగా స్పందించారు. ప్రజా సేవకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్‌ ఉన్నతాధికారుల సూచనల మేరకు శాఖాపరంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

13 వేల పంచాయతీలను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా, ఏం చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి కీలకమైన సూచనలు చేశారని, ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ముందుకు సాగుతున్నామని తెలిపారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులతో పాటు- శాఖలో ఉన్న సిబ్బంది, పంచాయతీలు, వార్డుల వారిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటు-న్నామని ఆయన తెలిపారు. ప్రజలకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా 24గంటలు కృషి చేస్తామని, శాఖలో పని చేస్తున్న సిబ్బందిని అనుక్షణం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement