Sunday, May 19, 2024

చిన్నారుల‌ భవిష్యత్తు కోసం పోలియో చుక్కలు..

రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్య‌క్ర‌మం మూడు రోజుల పాటు కొన‌సాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు ఐదేండ్ల‌లోపు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ సెంట‌ర్ల‌లో పోలియో చుక్క‌లు వేస్తారన్నారు. రేపు, ఎల్లుండి సిబ్బంది ఇంటింటికీ తిరిగి, ఇంకా ఎవ‌రైనా పిల్ల‌లు టీకాలు వేసుకోక‌పోతే గుర్తించి అక్క‌డే టీకాలు వేస్తారని చెప్పారు. జీవితాలను నాశనం చేయ‌గ‌లిగే పోలియో మహమ్మారి నుంచి మ‌న పిల్లలను కాపాడుకోవాలంటే పోలియో చుక్కలు వేయడం ఒక్కటే మార్గం అని అన్నారు. ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేసినా పిల్ల‌లు శాశ్వ‌తంగా విక‌లాంగులుగా మారిపోతారని తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్ల‌ల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్క‌లు వేయించాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం రాష్ట్ర‌వ్యాప్తంగా 50 ల‌క్ష‌ల డోసుల‌ను పంపిణీ చేశారు. టీకాల కోసం దూరంగా వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా హెల్త్‌ సెంట‌ర్లతోపాటు అంగ‌న్వాడీ కేంద్రాలు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, లైబ్ర‌రీలు, బ‌స్టాండ్లు, ఎయిర్ పోర్టులు, ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక పోలియో వ్యాక్సిన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.. రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 23,331 ప‌ల్స్ పోలియో బూత్‌ల‌ను ఏర్పాటు చేశామన్న మంత్రి.. వీరితోపాటు 869 మొబైల్ టీమ్స్‌, బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు, ఎయిర్ పోర్టులు వంటి ప్ర‌యాణ ప్రాంగ‌ణాల్లో 869 బృందాలు టీకాలు వేయ‌నున్నాయని వివరించారు.  ప‌ల్స్ పోలియోలో 2,337 మంది సూప‌ర్ వైజ‌ర్లు, 8,589 మంది ఏఎన్ఎంలు, 27,040 మంది ఆశా కార్య‌క‌ర్త‌లు, 35,353 మంది అంగ‌న్వాడీ టీచ‌ర్లు పాలుపంచుకుంటున్నారు. వీరితోపాటు మ‌హిళా సంఘాల స‌భ్యులు, మెప్మా, సెర్ఫ్ సిబ్బంది, న‌ర్సింగ్ స్టూడెంట్స్‌, టీచ‌ర్లు భాగ‌స్వాములు అవుతున్నారు. వారంద‌రికీ వైద్యారోగ్య‌శాఖ త‌ర‌ఫున ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు.

వ్యాక్సినేష‌న్ లో తెలంగాణ ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటుందన్నారు. ముఖ్యంగా పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ లో తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా ఉన్నదని గుర్తు చేశారు. ఇటీవ‌ల విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్‌లో తెలంగాణ‌లో 100 శాతం మంది పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు వేస్తున్నార‌ని స్ప‌ష్టంగా చెప్పిందని తెలిపారు.  క‌రోనా బారి నుంచి టీకా మ‌న‌ల్ని ఎలా ర‌క్షిస్తున్న‌దో… మ‌న పిల్ల‌ల‌ను పోలియో మ‌హ‌మ్మారి బారి నుంచి పోలియో చుక్క‌లు ర‌క్షిస్తాయని అన్నారు. మ‌నం వేయించే రెండు చుక్క‌ల వ్యాక్సిన్‌.. వారి నిండు జీవితానికి భ‌రోసా ఇస్తుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement