Thursday, May 9, 2024

గుజరాత్ అల్లర్ల కేసు.. ప్రధాని నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్

దేశంలో సంచలనం సృష్టించిన 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి సీఎం నరేంద్ర మోదీ సహా 62 మందికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తే దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవ్వాల కొట్టివేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఉత్తర్వులను సమర్థిస్తూ.. వారందరికీ మరోసారి క్లీన్ చిట్ ఇచ్చింది. గుజరాత్ అల్లర్ల కేసులో సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ.. దివంగత కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ భార్య జకియా ఆఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. గతంలో ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశాలతో తాజాగా జస్టిస్ ఏ.ఎం. ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ఏకీభవించింది.

కాగా, 2002, ఫిబ్రవరి 28న గుజరాత్ అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సహా మొత్తం 68 మంది చనిపోయారు. ఆ హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసుతో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా మరికొంతమందికి ఎలాంటి సంబంధం లేదని సిట్ తేల్చింది. వారందరికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా పలు కోర్టులను ఆశ్రయించారు. కానీ, ప్రతిచోటా ఆమెకు ఎదురెబ్బే తగిలింది. చివరకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో మార్చి 2008లో సిట్ ఏర్పాటు చేశారు. అనంతరం జఫ్రీ ఆరోపణలపై సిట్ విచారణ చేపట్టింది.

2010లో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని సిట్ దాదాపు తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. కాగా, నరేంద్ర మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జప్రీ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ ఉత్తర్వులను ఆ కోర్టు సమర్థించడంతో జఫ్రీ, సెతల్వాద్.. గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టులోనూ వారికి చుక్కెదురయింది. ఈ నేపథ్యంలో చివరికి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ తగిలింది. సిట్ క్లీన్ చిట్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, 2002లో గుజరాత్‌లో మూడు రోజుల పాటు జరిగిన అల్లర్లలో వెయ్యి మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement