Saturday, May 4, 2024

Komatireddy Venkat Reddy: రైతులకు సంకెళ్లు వేయడం సరికాదు

ప్రభుత్వ భూమి ఉంచుకుని.. రైతుల నుంచి భూమి లాక్కోవడం కరెక్ట్ కాదని, రైతులకు సంకెళ్లు వేయడాన్ని ఖండిస్తున్నామని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం కొన్ని మాసాలుగా భూములు తీసుకుంటున్నారని మండిపడ్డారు. భూసేకరణ పేరుతో బలహీన వర్గాలు, హరిజన, దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. గవర్నమెంట్ భూములు తీసుకోకుండా.. రైతుల దగ్గర ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూమిని గుంజుకుంటున్నారని ఆరోపించారు. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పొందుతున్న బాధతో.. భువనగిరి, రాయగిరి, ఇంకా మిగిలిన గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, అయినా, కొందర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందన్నారు. అయితే.. కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో రాయగిరి రైతులకు బేడీలు వేశారని అన్నారు. ఇది చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నా అన్నారు. ఇది మంచి పద్దతి కాదని తెలిపారు. రైతుల కోసం అంత చేస్తా.. ఇంత చేస్తున్నా అని చెప్పుకుంటున్న కేసీఆర్ దీనిపై ఏం సమాధానం చెప్తారన్నారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. అన్నదాతలకు సంకెళ్లు వేయడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించడమే అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement