Sunday, May 5, 2024

కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు: గవర్నర్

దేశ వ్యాప్తంగా కరోనా సంక్షోభం కొనసాగుతోందని.. కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉందన్నారు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ ప్రభావం పడినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు.  ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 95శాతం హామీలు పూర్తి చేశామన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని గవర్నర్ తెలిపారు. కరోనాను ఆరోగ్యశీలో చేర్చామన్నారు. ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు కేటాయించామని వెల్లడించారు. నవరత్నాలు ద్వారా లబ్ధిదారులకే నేరుగా సాయం అందుతోందన్నారు.

వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. రైతులకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని.. అమూల్‌తో ఒప్పందంతో పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. విద్యార్థులకు విద్యా కానుక, అమ్మఒడి, గోరు ముద్ద పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పేదలకు రెండు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నారని.. స్పందన ద్వారా ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నామన్నారు. విద్యాశాఖకు రూ.25, 714కోట్లు.. జగనన్న వసతి దీవెన కింద రూ.1049 కోట్లు.. జగనన్న విద్యా దీవెన కోసం రూ.4,879కోట్లు.. 44.5 లక్షలమంది తల్లులకు జగనన్న అమ్మఒడి అందిస్తున్నామన్నారు. మనబడి నాడు నేడు కింద 15,717 స్కూళ్ల ఆధునీకరణకు రూ.3,948 కోట్లు కేటాయించామన్నారు. రూ.1,600 కోట్లతో 36.8 లక్షల మందికి జగనన్న గోరుముద్ద అందిస్తామని తెలిపారు. జగనన్న విద్యా కానుక ద్వారా 47లక్షల మందికి కిట్‌లు అందించామని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.

రాష్ట్రంలోని 3 ప్రధాన ఇండస్ట్రియల్‌ కారిడార్లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు.. విజయనగరంలో భోగాపురం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నామన్నారు గవర్నర్. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. రాష్ట్రంలో 6 పోర్టులు, 2 ఫిషింగ్‌ హార్బర్లను రెండు విడతల్లో అభివృద్ధి చేస్తామని గవర్నర్‌ అన్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద 87,74,674 మంది మహిళలకు 6792.21 కోట్లు కేటాయించామన్నారు.వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద 8.78 లక్షల మహిళా సంఘాలకు రూ.1399.79 కోట్లు, వైఎస్సార్‌ చేయూత కింద 45 నుంచి 60 మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహళలకు 4604.13 కోట్లు కేటాయించాం. పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చట్టం చేశామని గవర్నర్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement