Monday, April 29, 2024

రెండు వేల నోట్ల మార్పిడి – కిట‌కిట‌లాడుతున్న న‌గ‌ల దుకాణాలు

అమరావతి, ఆంధ్రప్రభ: రిజర్వు బ్యాంక్‌ రూ.2వేల నోట్లను వాపసు చేసుకోవడంతో పసిడి అమ్మకాలు పరుగులు పెడుతున్నాయి. పెద్ద మొత్తం లో రూ.2వేల నోట్ల నగదు నిల్వలు ఉన్నవారు బంగారం రూపం లో మార్చుకుంటున్నారు. రాష్ట్రంలోని నగల షాపుల్లో బంగారం కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపధ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అప్రమత్తమైంది. బంగారం కొనుగోళ్లపై ఓ కన్నేసి ఉంచింది. ప్రధాన పట్టణా ల్లోని జ్యుయలరీ షాపుల్లో అమ్మకాలను నిశిత పరిశీలనకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. మరో వైపు స్మగ్గింగ్‌ బంగారం మార్కెట్లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉండటంతో కస్టమ్స్‌ అధికారులు నిఘాను పటిష్టం చేశారు. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు రూ.2వేల నోటును వెనక్కి తీసుకుంటోంది. లక్షల్లో రూ.2వేల నోట్లు చెలామణిలో లేకపోవడాన్ని గుర్తించిన రిజర్వ్‌ బ్యాంకు.. కలుగు నుంచి నోట్లు బయటకు తీయక తప్పని పరిస్థితులు కలిపించింది.

నేటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చు కోవచ్చంటూ ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించింది. రోజుకు పది నోట్లు బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు కలిపించారు. నోట్ల వాపసుకు మరో నాలుగు నెలల వ్యవధి ఉన్నందున ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించినప్పటికీ.. ఎప్పటికైనా ఇబ్బందులు తలెత్తొచ్చనేది పలువురి భావన. పైగా నోట్ల మార్పిడీకి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. రూ.50వేలు పైబడితే పాన్‌ కార్డును తప్పనిసరి చేశారు. ఇవన్నీ తలనొప్పులు ఎందుకనేది పలువురిలో నెలకొన్న భావన. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో రూ.2వేల నోట్లను నిల్వ చేసిన వారు ప్రత్యమ్నాయంగా బంగారం కొనుగోళ్లను ఎంచుకుంటున్నారు. రోజు రోజుకూ బంగారం రేటు పెరుగుతున్న తరుణంలో పెట్టుబడిగా ఉంటుందనేది పలువురి అభిప్రాయం. శుభకార్యాల సీజన్‌ కావడంతో జ్యుయలరీ షాపుల్లో నగల అమ్మకాలు భారీగానే జరుగుతున్నాయి. మరో వైపు రూ.2వేల నోట్ల వాపసు నిర్ణయం కూడా జ్యుయలరీ వ్యాపారులకు కలిసొచ్చింది.

వాణిజ్య పన్నుల శాఖ అప్రమత్తం..
రాష్ట్రంలోని జ్యుయలరీ షాపుల్లో అమ్మకాలు జోరు పెరుగుతుండటంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన పట్టణాల్లోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. వ్యాపారం పెద్ద ఎత్తున సాగే షాపుల కార్యకలాపాలను ప్రత్యేకంగా గమనించాలని ఆదేశించారు. సాధారణంగా నగదు నిల్వలు బయట పడకుంటా బంగారంపై పెట్టుబడి పెడుతున్న నేపధ్యంలో బిల్లులు లేకుండా క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రోజు జ్యుయలరీ షాపుల్లో రోజు వారీ వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. శుభకార్యాలు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఇదే క్రమంలో నోట్ల వాపసు అంశం కూడా జోడవ్వడంతో మరింతగా అమ్మకాలు పెరుగుతాయి. ప్రతి షాపుల్లో వ్యాపార లావాదేవీలను నిశితంగా పరిశీలించాలని జిల్లాల అధికారులకు సమాచారం అందింది. అవసరమైతే ఎంపిక చేసిన షాపుల్లో ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని ఆకస్మిక తనిఖీలు కూడా చేయాలని స్పష్టం చేశారు. ఏ షాపులో కూడా పన్ను ఎగవేతకు అవకాశం లేకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొద్ది రోజుల పాటు ఇదే హడావుడి ఉండే అవకాశం ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లాస్థాయి అధికారులకు సూచనలు వెళ్లాయి. ఉన్నతస్థాయి ఆదేశాల నేపధ్యంలో ఇప్పటికే జిల్లాల అధికారులు జ్యుయలరీ షాపులపై కన్నేసి ఉంచారు. ఎక్కడైనా అనుమానాస్పద అమ్మకాలు జరిగితే గుర్తించి అడ్డుకునేలా సిబ్బందిని సైతం అప్రమత్తం చేశారు.

రంగంలోకి కస్టమ్స్‌..
రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.రెండు వేల నోటును వాపసు చేయాలని ఆదేశించిన నేపధ్యంలో బంగారం కొనుగోళ్లు పెరగడంపై కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌ఒ బంగారం జ్యుయలరీ షాపులకు చేరే అవకాశం ఉన్నట్లు గుర్తించి నిఘాను పటిష్టం చేశారు. ఇప్పటికే సరిహద్దు చెక్‌ పోస్టులపై కస్టమ్స్‌ బృందాలు నిఘా పెట్టాయి. విదేశీ స్మగ్లింగ్‌ బంగారం చెన్నై నుంచే పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని కస్టమ్స్‌ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలపై నిఘా పెంచారు. ఇదే సమయంలో గతంలో బంగారం స్మగ్లింగ్‌ కేసుల్లో పట్టుబడిన వారిపై సర్వలెన్స్‌ పెట్టారు. మరో వైపు ఇన్‌ఫార్మర్లను అప్రమత్తం చేసి సమాచారం సేకరిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు, బస్సులపై కూడా నిఘా పెట్టినట్లు అధికార వర్గాల సమాచారం. అన్ని వేళల్లో తనిఖీలకు సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే ఉన్నతస్థాయి ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement