Thursday, May 2, 2024

మ‌హిళా శ‌క్తికి సెల్యూట్ – ట్వీట్ చేసిన ప్ర‌ధాని మోడీ

మ‌హిళా శ‌క్తికి సెల్యూట్ చేశారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం “గౌరవంతో పాటు అవకాశాలకు ప్రాధాన్యతనిస్తూ” వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై దృష్టి సారిస్తుందని అన్నారు. “మహిళా దినోత్సవం నాడు, మా నారీ శక్తికి.. విభిన్న రంగాలలో వారు సాధించిన విజయాలకు నేను వందనం (సెల్యూట్‌) చేస్తున్నాను. భారత ప్రభుత్వం గౌరవం ..అవకాశాలకు ప్రాధాన్యతనిస్తూ తన వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై దృష్టి సారిస్తుంద‌ని మోడీ ట్వీట్ చేశారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలను అగ్రగామిగా తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. “ఆర్థిక సమ్మేళనం నుండి సామాజిక భద్రత, నాణ్యమైన వైద్యం, గృహనిర్మాణం, విద్య, వ్యవస్థాపకత, భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మా నారీ శక్తిని ముందంజలో ఉంచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. రానున్న కాలంలో ఈ ప్రయత్నాలు మరింత ఉధృతంగా కొనసాగుతాయి” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌ష్క‌రించుకుని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కచ్‌లోని ధోర్డోలోని మహిళా సెయింట్ క్యాంప్‌లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై సెమినార్‌లో ప్రధాని మోడీ ప్ర‌సంగిస్తారు. సమాజంలో మహిళా సాధువుల పాత్రను, మహిళా సాధికారతకు వారు చేస్తున్న కృషిని గుర్తించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్ర‌ధాని మంత్రి కార్యాల‌యం వివ‌రాల ప్ర‌కారం.. ధోర్డోలో జరిగే సెమినార్‌కు 500 మంది మహిళా సాధువులు హాజరవుతారని తెలిపారు. సెమినార్‌లో సంస్కృతి, మతం, స్త్రీ ఉద్ధరణ, భద్రత, సామాజిక స్థితిగతులు మరియు భారతీయ సంస్కృతిలో మహిళల పాత్రపై సెషన్‌లు నిర్వ‌హిస్తారు. మహిళలు సాధించిన విజయాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై కూడా చర్చించనున్నారు. ఈ సెమినార్‌లో కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర సహాయ మంత్రులు సాధ్వి నిరంజన్ జ్యోతి .. భారతి ప్రవీణ్ పవార్ కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సాధ్వి రితంబర, మహా మండలేశ్వర్ కనకేశ్వరి దేవి తదితరులు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement