Thursday, May 16, 2024

Spl Story| మిజోరంలో ఎగిరే బల్లులు.. ప్రపంచంలోని 13 రకాలలో ఇవి చాలా డిఫరెంట్​!

ఎగిరే రాకాసి బల్లుల గురించి విన్నాం.. ఎగిరే తొండలనూ చూశాం. ఎగిరే బల్లుల గురించి తెలుసు. కానీ, మిజోరం అడవుల్లో ఈ మ‌ధ్య‌కాలంలో గుర్తించిన ఎగిరే బల్లులు మరే దేశంలోనూ లేవట. మిజోరం యూనివర్సిటీ, జర్మనీలోని టుబిన్‌జెన్‌ మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బయోలజీకి చెందిన పరిశోధకులు వీటిని కనుగొన్నారు. పారాచ్యూట్‌ గెకోగా వీటిని పిలుస్తున్నారు. వీటికి గెక్కో మిజోరమెన్‌సిస్‌గా అనే శాస్త్రీయనామం పెట్టారు. గ్లైడింగ్‌ గెకోలుగానూ పిలుస్తున్న ఈ కొత్తజాతి ఎగిరే బల్లులపై జరిగిన పరిశోధనల వివరాలను జర్మనీకి చెందిన ప్రఖ్యాత జర్నల్‌ సలమంద్రాలో ప్రచురించారు.

‌‌- ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

ఉభయచరాలు, సరీసృపాలకు చెందిన పరిశోధనల వివరాలను జ‌ర్మ‌నీకి చెందిన స‌ల‌మంద్రా అనే పత్రికలో ప్రచురించడాన్ని గౌరవంగా భావిస్తారు. మిజోరాం అడవుల్లో కనుగొన్న కొత్త రకం ఎగిరే బల్లులు, గెక్కో పొపాయెన్‌సిస్‌కు దగ్గరి పోలికలున్నాయి. అయితే, శరీరాకృతి, పరిమాణం, రంగుల్లో మాత్రం తేడాలున్నాయి. మిజోరం యూనివర్శిటీకి చెందిన ప్రొ.మార్‌ త్లవాంతే లాల్‌రెమ్‌సంగా సారథ్యంలో ఈ గెకోలపై పరిశోధనలు జరిగాయి. ప్రపంచంలో గెకో జెనస్‌ కు చెందిన 13 జాతులకు చెందిన బల్లులున్నాయి. వాటిలో చాలా రకాలు దక్షిణాసియాలో కనిపిస్తాయి.

అయితే పైఖోజూన్‌ లియోనోటమ్‌ అనే (స్మూత్‌ బ్యాక్‌డ్‌ గ్లైడింగ్‌ గెకో) అనే జాతికి చెందిన ఈ పారాచ్యూట్‌ గెకోలు మిజోరం అడవుల్లో మాత్రమే జీవిస్తున్నాయని ప్రొ. త్లవాంతే వెల్లడించారు. వాటి డీఎన్‌ఏ, ఇతర పరీక్షల అనంతరం తెలిసిందేమిటంటే… మిగతా జాతుల ఎగిరే బల్లులకూ,వీటికి చాలా తేడాలున్నాయని. మయన్మార్‌లో ఈ తరహా బల్లులు కన్పించినప్పటికీ పోలికలు, డీఎన్‌ఏ, రంగు వంటి అంశాల్లో పూర్తి వైరుధ్యం ఉండటం విశేషం. ఇవి 20 సెంటీమీటర్ల పొడవుతో ఉండి ఒక చెట్టు మీంచి మరో చెట్టుమీదకు ఎగురుతున్నాయని వారు తెలిపారు.

భారత్‌లో ఈ పారాచ్యూట్‌ బల్లుల సంఖ్య ఇతమిత్థంగా తెలీదు. అయితే, ఇక్కడ ఓ చిక్కుంది. మిజోరం ప్రజలకు బల్లులంటే మూఢనమ్మకాలు ఎక్కువ. వాటిని వేటాడి చంపేస్తూంటారు. అందువల్ల ఈ ఎగిరే బల్లులను కాపాడుకోవడం ముఖ్యమని, ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆ శాస్త్రవేత్తలు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement