Sunday, May 5, 2024

అసోంలో వ‌ర‌ద‌లు-63మంది మృతి- ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు


వరదలపై కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) బులిటెన్ విడుదల చేసింది. నాగావ్ జిల్లాలో కోపిలి నది అధిక వరద స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తోందని చెప్పింది. బ్రహ్మపుత్ర, జియా-భరాలి, పుతిమరి, పగ్లాడియా, మానస్, బెకి, బరాక్ మరియు కుషియారా వంటి ఇతర నదులు ప్రవహిస్తాయని అధికారులను అప్రమత్తం చేసింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం వదరల వల్ల 32 జిల్లాల్లో 30.99 లక్షల జనాభా ప్రభావితమైంది. అదే సమయంలో 66 వేల పైచిలుకు హెక్టార్లలో పంట ముంపునకు గురైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 514 సహాయ శిబిరాల్లో నిరాశ్రయులైన 1.56 లక్షల మంది ప్రజలు తలదాచుకుంటున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి వ‌ర‌ద పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కమ్రూప్, దర్రాంగ్ జిల్లాల్లోని బాధిత ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న కొన్ని సహాయ శిబిరాలను సీఎం హిమంత సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ..ఎంతటి ఆపదనైనా ఎదుర్కొనేందుకు, వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement