Sunday, May 19, 2024

అయిదు విప్ల‌వాల‌తో తెలంగాణ అద్భుత ప్ర‌గ‌తి…కెటిఆర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : జల దృశ్యం నుంచి సుజల దృశ్యం దాకా.. మన పార్టీ ప్రగతి ప్రస్థానం కొనసాగుతోందని, సీఎం కేసీఆర్‌ దార్శనికత దేశానికి మార్గనిర్దేశం చేస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. ఇదంతా ముందుచూపు కలిగిన మన ముఖ్యమంత్రితోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఇటీవల తాను ఒక పెద్ద మనిషిని కలిసినపుడు ”మీ ముఖ్యమంత్రిలో ఉద్యమకారుడే కాదు.. మంచి పరిపాలనాధక్షుడు కూడా ఉన్నాడు” అని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ నాయకులకు గుర్తు చేశారు. ఈ రెండూ కలిసి ఉండడం చాలా అరుదు అని కొనియాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం.. సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్ధితో కూడుకున్నదని, అందుకే కేసీఆర్‌ నేతృత్వంలో ముందుకు నడిచేందుకు దేశం కదిలి వస్తోందని పేర్కొన్నారు.


లెక్కా, పత్రం లేకుండా చేసే పాలన అనేది కరెక్టు కాదు.. అది మన సీఎం నమ్మిన అంశమని కేటీఆర్‌ తెలిపారు. అందుకే రాష్ట్రం ఏర్పాటు- కాగానే సకల జనుల సర్వే నిర్వహించి జనాభా గణాంకాలతో అభివృద్ధిని సుసంపన్నం చేశారని వెల్లడించారు. దేశంలో 2.8 శాతం జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంతో 30శాతం అవార్డులను సొంతం చేసుకున్నదని తెలిపారు.
ప్రజలకు ఏం కావాలో.. వారేం కోరుకుంటారో.. అనేది మన అధినేతకు తెలిసినంతగా ఇతరులకు తెలవదనేది మేధావులు చెప్తున్న అంశంగా కేటీఆర్‌ పేర్కొన్నారు. అందుకే తెలంగాణలో ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని వ్యాఖ్యానించారు. పల్లెలే కాదు పట్టణాలు కూడా గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటున్నాయన్నారు. పారిశ్రామీకరణ పర్యావరణ హితంగా కొనసాగుతున్నదని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగిందని, విద్య, వైద్యం, భారీగా గురుకులాలు ఏర్పాటు- ఏకైక రాష్ట్రం కూడా తెలంగానానేనని స్పష్టం చేశారు. ‘మౌలిక వసతుల కల్పన అనేది అభివృద్ధికి మూలం అని నాటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనెడీ అన్నారు.. దేశంలో సహజ వనరులను వాడుకునే తెలివున్న ప్రభుత్వాలే లేవు.. ”అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌” అని సీఎం కేసీఆర్‌ పిడికిలి బిగిస్తే దేశమంతా గొప్పగా స్పందిస్తున్నది.. మహారాష్ట్రలో విజయవంతమౌతున్న సభలే అందుకు నిదర్శనం’ అని కేటీఆర్‌ వెల్లడించారు.


తెలంగాణ రాష్ట్రం హరిత, శ్వేత (పాలు), నీలి (మత్స్య), పింక్‌ (మాంసం), ఎల్లో (ఆయిల్‌ఫాం).. ఐదు విప్లవాలతో ప్రగతిని సాధిస్తున్నదని తెలిపారు. 4.5 లక్షల కోట్ల రూపాయాలను కేవలం వ్యవసాయం, దానికి అనుబంధంగా రంగాలకే ఖర్చు చేయడం దేశంలోనే ఎన్నడూ జరగలేదన్నారు. పాలకు జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అదానికి ఇచ్చిన పోర్టులకు ఎందుకు చేయట్లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. యువతను రాజకీయాల దిశగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పొద్దున లేస్తే ప్రతి అంశాన్ని, మన జీవితాలను రాజకీయాలు ప్రభావితం చేస్తున్నప్పుడు.. రేపటితరం రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పులు తేవడం అనేది ఏదో తప్పుగా మాట్లాడుతున్న రాజకీయ నాయకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement