Friday, May 3, 2024

తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్ డౌన్

తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలను మూతపడ్డాయి. నేటి నుంచి ఈ నెల 21 వరకు అంటే పది రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలు కానుండగా.. ఈ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతించింది. రోజులో 20 గంటల పాటు లాక్ డౌన్ అమలు చేస్తారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వైన్ షాపులతో పాటుగా అన్ని రకాల కొనుగోళ్ళు ఈ సమయంలో అందుబాటులో ఉంటాయి.

లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో ఉదయం 10 గంటల వరకు అన్ని మార్కెట్లు, వైన్ షాప్స్ వద్ద రద్దీ ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్ లో నిత్యావసరాల కోసం ఉదయం నుంచే రోడ్లపైకి ప్రజలు వచ్చారు. మరోవైపు వాక్సినేషన్ కార్యక్రమం మాత్రం ఆగేది లేదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకా కోసం వెళ్ళే వారికి అత్యవసర సర్వీసులకు మాత్రం అనుమతి ఉంటుంది. ఇక పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 

కాగా, నేటీ నుంచి పదిరోజుల పాటు ఈ లాక్ డౌన్ అమలు కానుండగా.. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించింది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పకడ్బంధీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతించింది. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలకు ఎక్కడా ఆటంకం కలిగించకూడదని ప్రభుత్వం తెలిపింది.

వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. ఉపాధి హామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి. ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగనున్నాయి. ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులకు మినహాయింపు ఇచ్చారు. అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది. పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. బ్యాంకులు, ఏటీఎంలు యథావిథిగా పని చేయనున్నాయి. ముందస్తు అనుమతులతో జరిగే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఉంది.

- Advertisement -

ఇది కూడా చదవండి: ఐవర్ మెక్టిన్‌తో తగ్గుతున్న కరోనా మరణాల ముప్పు

Advertisement

తాజా వార్తలు

Advertisement