Wednesday, May 15, 2024

Web Series: ఫింగ‌ర్ టిప్.. మ‌న జీవితంలో మ‌న వేళ్లే శ‌త్రువులు అవుతున్న‌య్‌!

వెబ్ సిరీస్ : ఫింగర్‌టిప్ (సీజన్ 2)
మొత్తం ఎపిసోడ్లు: 8
నటీనటులు: ప్రసన్న, అపర్ణ బాలమురళి, రెజినా కసాండ్ర, కన్న రవి, శరత్ రవి, వినోద్ కిషన్‌ తదితరులు.
దర్శకత్వం: శివకర్ శ్రీనివాసన్
ఓటీటీ: జూన్ 17 నుంచి Zee5లో స్ట్రీమింగ్‌

ఇప్పుడు ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. ప‌లు కంపెనీ ప్రొవైడ‌ర్ల మ‌ధ్య నెల‌కొన్ని కాంపిటీష‌న్‌తో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఇంట‌ర్‌నెట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇక‌.. ఇంటర్నెట్ అరచేతిలో ప్రపంచాన్ని చూపే అత్యాధునిక టెక్నాలజీగా మారింది. ఇది ఈ మ‌ధ్య కాలంలో మన జీవితాలను ఎంతగా మార్చేసిందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రజలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో మ‌నం క‌ళ్లారా చూస్తున్నాం. ప్రపంచంలో ఇప్పుడు ఎవరు ఎక్కడున్నా లైవ్‌లో చూసేంత టెక్నాలజీ అందుబాటులోకి వ‌చ్చింది. ఇది కొంత‌వ‌ర‌కు మేలే చేస్తుంది. కానీ, అందరికీ అన్ని స‌మ‌యాల్లో అయితే కాద‌నే చెప్ప‌వ‌చ్చు.

YouTube video

ఈ టెక్నాలజీ వల్ల మ‌నం తెలియకుండానే కొంత‌మందికి టార్గెట్ అవుతున్నామ‌నే సంగతి చాలా మందికి తెలియ‌దు. మీ మొబైల్‌కు మాత్రమే పరిమితం అనుకుంటున్న మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు క్రిమిన‌ల్స్‌ చేతిలోకి చేరే ‘తాళం’ చేతిని మ‌న‌మే స్వయంగా ఇస్తున్నాం. ఇది ఇప్పుడిప్పుడే ఎవ‌రికీ న‌మ్మ‌కం క‌ల‌గ‌క‌పోవ‌చ్చు. కానీ, మోస‌పోవ‌డం అనేది మ‌న‌దాకా వ‌స్తే అప్పుడు క‌చ్చితంగా న‌మ్ముతాం. దీనికోసం ఈ మ‌ధ్య వెబ్ సిరీస్‌గా వ‌చ్చిన ‘ఫింగర్‌టిప్’ సీజన్-1 చూస్తే మ‌నం ఎంత‌లా మోస‌పోతున్నామో తెలుస్తుంది.. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఫింగర్‌టిప్’ సీజన్-2 నేపథ్యం కూడా అదే.

అయితే, సీజన్‌-2 మరింత థ్రిల్‌గా తెరకెక్కించారు. మన జీవితాలపై ఇంటర్నెట్ ఏ విధంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు శివకర్ శ్రీనివాసన్, రచయిత రోహిత్ అందించిన ఈ థ్రిల్లర్‌ వెబ్ సీరిస్‌.. 8 ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రసన్న, అపర్ణ బాలమురళి, రెజినా కసాండ్ర, కన్న రవి, శరత్ రవి, వినోద్ కిషన్ లీడ్ రోల్స్‌లో నటించారు.

ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభం కాగానే.. సైకాలజిస్ట్ శ్రుతి (అపర్ణ బాలమురళి)కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఇచ్చిన పేషెంట్ ఇంటికి వెళ్తుండగా ఓ షాకింగ్ ఘటన చూస్తుంది. శ్రుతి కళ్లముందే ఆ పేషెంట్ అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి సూసైడ్‌ చేసుకుంటుంది. ఈ ఘటనకు 6 నెలల ముందు ఏం జరిగిందనేదే అసలైన కథ. సైకాలజిస్ట్ శ్రుతి ఆన్‌లైన్, సోషల్ మీడియా వల్ల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నవారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తుంటుంది. ఈ సందర్భంగా ఆమె పోలీసుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రజంటేషన్ ఇస్తుంది. డిజిటల్ సొసైటీలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రమాదాలు, బాధితులు డిప్రెషన్‌లోకి చేరుకోవడం ఆత్మహత్యలకు పాల్పడటం, మానసిక వ్యాధులతో బాధపడటం వంటి అంశాలను పోలీసులకు తెలియజేస్తుంది.

- Advertisement -

ఆమె చెప్పే విషయాలను పోలీసులు సీరియస్‌గా తీసుకోరు. అయితే, ACP అరివళగన్ (ప్రసన్న) మాత్రం దీనిపై ఆసక్తి చూపిస్తాడు. దీంతో వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కుదురుతుంది. కానీ, ఆమె ఏసీపీ వద్ద ఒక రహస్యాన్ని దాస్తుంది. మరోవైపు అరివళగన్‌ ‘ఎక్లిప్స్’ అనే హ్యాకర్‌‌ను ఎదుర్కోవలసి వస్తుంది. ‘ఎక్లిప్స్’ చేసేవి మంచి పనులైనా.. ఆన్‌లైన్ నేరాలకు పాల్పడుతున్నాడనే కారణంతో ఎలాగైనా ఆ హ్యాకర్‌ను పట్టుకోవాలని ట్రై చేస్తాడు. అదే సమయంలో అరివళగన్‌కు ఎంతో సన్నిహితుడైన ఓ పెద్దాయన, ఆయన భార్యను ఎవరో దారుణంగా హత్య చేస్తారు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది.

ఈ కథకు సమాంతరంగా.. తన ముక్కును అసహ్యించుకొనే ప్రియా (రెజినా) సెలబ్రిటీగా మారినా సరే, అసంతృప్తితో జీవిస్తుంటుంది. చిన్నప్పుడు స్నేహితులు ఆమెను వంకర ముక్కు అని వెక్కిరిస్తారు. అది ఆమెను మానసికంగా కుంగదీస్తుంది. దీంతో ఆమె ఎలాగైనా సరే తన ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని భావిస్తుంది. అదే సమయంలో ఆమెకు హాలీవుడ్ సినిమాలో అవకాశం వస్తుంది. మరోవైపు సెల్‌ఫోన్ దుకాణం యజమాని ఆదినాథ్ (శరత్ రవి) డీప్ ఫేక్‌ వీడియోలతో అమ్మాయిలను లోబరుచుకోవడం, ఓ పోలీస్ ఆఫీసర్ కూతురి జీవితంతో ఆటలాడటాన్ని కథలో చూపిస్తారు. మరోవైపు ఫుడ్ డెలివరీ చేసే వెంకట్ (వినోత్ కిషన్).. తన ప్రేమ విఫలమైందనే కారణంతో మద్యం మత్తులో అమ్మాయిలను తిడతాడు. అది మరొకడు వీడియో తీసి వైరల్ చేస్తాడు.

ఇంకో వైపు నవీన్(కన్న రవి) సోషల్ మీడియాను వాడుకొని నకిలీ డిజిటల్ కంటెంట్ సృష్టిస్తాడు. ఓ రాజకీయ నాయకుడిని ఎన్నికల్లో గెలిపించడానికి ప్రయత్నిస్తాడు. ఈ పాత్రలన్నీ ఒకరికి తెలియకుండా మరొకరితో కనెక్టవుతూ ఉంటాయి. ఏసీపీ దగ్గర శ్రుతి దాచిన రహస్యం ఏమిటీ? శ్రుతికి అక్కకు ఏం జరుగుతుంది? ఆమె తండ్రికి చూపు ఎందుకు పోతుంది? ఏసీపీ సన్నిహితులను ఎవరు చంపుతారు? నటి ప్రియా ముక్కు సర్జరీ తర్వాత ఎదుర్కొనే పరిణామాలు ఏమిటీ? డీప్ ఫేక్ వీడియోలు చేసే ఆదినాథ్‌ను పోలీసులు పుట్టుకోగలిగారా? ఫుడ్ డెలివరీ బాయ్ వీడియో ఇద్దరి మరణానికి ఎలా కారణం అవుతుంది? ఏసీపీ పట్టుకోవాలనే చూస్తున్న ఆ ‘ఎక్లిప్స్’ ఎవరు? అనేది తెలియాలంటే ఫింగ‌ర్‌టిప్‌ వెబ్ సీరిస్‌ను చూడాల్సిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement