Monday, April 29, 2024

లాక్ డౌన్ భయాలు.. సొంతూళ్లకు వలస కార్మికులు

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. కేసులు రోజుకో రికార్డు స్థాయిలో భారీగా నమోదవుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డికి మ‌ళ్లీ ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న చేస్తున్నాయి. దేశంలో లాక్‌డౌన్ ఉండ‌ద‌ని ప్ర‌ధాని మోదీ స్పష్టం చేసినా.. ప‌లు రాష్ట్రాల్లో  కోవిడ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాడ్ డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాకట తదితర రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా అధికంగా నమోదు అవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అంక్షలు కూడా కఠినం చేశాయి.

కరోనా విజృభిస్తున్నందున అవసరమైతే తమ రాష్ట్రంలో లాక్ డౌన్ వేయడానికీ వెనుకాడబోమని కర్నాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే ప‌లు మార్లు లాక్‌డౌన్ త‌ప్పేలా లేద‌ని మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే చెప్పారు. దేశంలోనో న‌మోదు అవుతోన్న క‌రోనా కేసుల్లో మ‌హారాష్ట్రలోనే స‌గం కేసులు ఉన్నాయి. రాజ‌ధాని ముంబైలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.. ఓవైపు కేసుల తీవ్ర‌త‌, మ‌రోవైపు లాక్‌డౌన్ భ‌యాల‌తో.. అక్క‌డున్న వల‌స కార్మికులు క్ర‌మంగా త‌మ సొంతూళ్ల‌కు వెళ్తున్నారు. పొట్టచేత పట్టుకొని పనుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన కూలీలు, వలస కార్మికులు.. గతేడాది అనుభవాలతో ముందుజాగ్రత్త పడుతున్నారు. బస్సులు, రైళ్లలో సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌ తదితర పలు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి మ‌హారాష్ట్రకు వ‌ల‌సొచ్చిన సుమారు ల‌క్షల మంది కార్మికులు.. త‌మ సొంత గ్రామాల‌కు చేరుకుంటున్నారు. గ‌త వారం రోజులుగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లే రైళ్ల‌న్నీ ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతున్నాయ‌ని అధికారులు చెబుతున్నారు. ముంబై నుంచి గోర‌ఖ్‌పూర్‌, వార‌ణాసి, ప్ర‌యాగ్‌రాజ్‌, ల‌క్నో వెళ్లే రైళ్లలో ఈ ర‌ద్దీ ఎక్కు‌వ‌గా క‌నిపిస్తోంది. లాక్‌ డౌన్ భయంతోనే కార్మికులు సొంత గ్రామాలకు వెళ్తున్నారు.

గతేడాది ఎలాంటి ముంద‌స్తు సూచ‌న‌లు లేకుండా లాక్‌డౌన్‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది కేంద్రం. దీంతో ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించిపోయి.. ఉపాది లేక, నగరాల్లో ఉండ‌లేక‌.. ల‌క్ష‌లాది మంది కార్మికులు కాలిన‌డ‌క‌న సొంత ఊళ్ల‌కు చేరుకోవాల్సి వ‌చ్చింది. దారిలో కొందరు ప్రాణాలు కూడా వదిలారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతుండ‌డంతో.. గ‌త అనుభ‌వాన దృష్ట్యా.. ముందే ఉన్న నగరాలను వదిలి ఊళ్ల‌కు వెళ్లిపోతున్నారు.

గతేడాది లాక్‌డౌన్‌ నేర్పిన పాఠాలను గుర్తుచేసుకుంటున్న వలస కార్మికులు.. కఠిన ఆంక్షలు పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. గుజరాత్‌, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఇప్పటికే పలువురు వలస కార్మికులు సొంతూళ్లకు పయనమయ్యారు. మహారాష్ట్రలోని పుణెలో పనిచేస్తున్న దాదాపు సగం మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌లోని గ్రామాల నుంచి గుజరాత్‌లోని సూరత్‌, అహ్మదాబాద్‌ నగరాలకు పనుల కోసం వలస వచ్చిన కార్మికులు కూడా తిరిగి ప్రయాణమవుతున్నారు.

- Advertisement -

మరోవైపు  సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికులతో ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ బస్‌ టెర్మినల్‌, అహ్మదాబాద్‌లోని కలుపూర్‌ రైల్వే స్టేషన్‌, ముంబై, సూరత్‌లోని ప్రధాన బస్టాండ్లు రద్దీగా మారాయి. యూపీ, బీహార్‌కు వెళ్లే అన్ని రైళ్లు కొన్ని వారాలపాటు ఖాళీగాలేవని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement