Thursday, April 25, 2024

Story | కడ్తాతో రైతు పని ఖతం.. నిబంధనలకు మించి తరగు తీస్తున్న మిల్లర్లు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రతిసారీ ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతు నిలువుదోపీడీకి గురవుతున్నాడు. మిల్లర్ల చేతిలో అన్నదాతల నిలువుదోపీడీ ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. తేమ, తాలు శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో క్వింటాకు 3 నుంచి 8 కిలోల దాకా తరుగు (కడ్తా) తీస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రతి పంట సీజన్‌ కొనుగోళ్ల సమయంలో ఈ దోపీడీ కొనసాగుతూనే ఉంది. రైతులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నా… పౌరసరఫరాల శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వ్యాపారులు దళారుల మోసాల నుంచి విముక్తి కలిగించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేసింది.

కమిషన్లు, తరుగు, తాలు, తక్కువ ధర తదితర వ్యాపారుల దోపీడీల నుంచి రైతులను కాపాడి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులను అప్పుల ఊబినుంచి బయటపడేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. అయితే ప్రభుత్వ సదాశయం అమలులో పౌరసరఫరాలశాఖ అధికారులు చిత్తశుద్ధి చూపకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ మిల్లర్ల దోపీడీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.

తరుగుపేరిట దోపిడీ చేస్తున్నారు..

క్వింటా బస్తాపై రెండుసార్లు తరుగు తీస్తూ రైతులను మిల్లర్లు అందినకాడికి దోచుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తూకం వేసేటప్పుడు క్వింటాకు 3 కిలోల మేర, తూకం అయ్యాక ధాన్యం లారీ లోడ్‌ మిల్లుకు చేరాక మరోసారి లారీపైన గుత్తా తరుగుకు మిల్లర్లు పాల్పడుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో క్వింటాకు తరుగు 8కిలోలకు చేరుతోంది. ఫలితంగా 20 క్వింటాళ్ల ధాన్యం అమ్మిన రైతు క్వింటాన్నర నష్టపోవాల్సి వస్తోంది. డబ్బుల రూపంలో లెక్కేస్తే 20క్వింటాళ్లు అమ్మిన రైతు రూ.3వేలకు పైగా ఒక్క తరుగు కారణంగానే నష్టపోవాల్సి వస్తోందన్న ఆవేదన రైతుల నుంచి వ్యక్తమవుతోంది.

- Advertisement -

కోట్లలోనే దండుకుంటున్నారు..

కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోలచొప్పున ఒక్కో బస్తాలో ధాన్యాన్ని లోడ్‌ చేస్తుంటారు. అయితే 40 కిలోలకు బదులు మిల్లర్ల ఆదేశాల మేరకు హమాలీలు ఒక్కో బస్తాలో 43 కిలోల దాకా తూకం వేస్తున్నా పౌరసరఫరాలశాఖతోపాటు ఆయా జిల్లాల్లోని సంబంధిత యంత్రాంగాలు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో రైతులు నిరాటంకంగా నిలువుదోపీడీకి గురవుతూనే ఉన్నారు. సగటున క్వింటాల్‌ ధాన్యానికి ఏడున్నర కిలోల చొప్పున తరుగుతీస్తున్న మిల్లర్లు 20 క్వింటాళ్లు పండించిన రైతు నుంచి తరుగు పేరిట ఏకంగా క్వింటాన్నర ధాన్యాన్ని దోచుకుంటున్నారు. సాధారణంగా ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఇలా తరుగుపేరిట రైతుల ను మిల్లర్లు చేస్తున్న నిలువుదోపీడీ అక్రమాలు లెక్కలేస్తే కోట్లలోనే ఉంటున్నాయని, అయినప్పటికీ పౌరసరఫరాలశాఖగాని, సంబంధిత జిల్లా యంత్రాంగాలు గాని పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే తంతు..

పౌరసరఫరాలశాఖ ధాన్యం సేకరణకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించింది. తేమ శాతం గరిష్టంగా 17శాతాన్ని మించరాదని, చెత్త తాలూకు 1శాతం, మట్టిపెళ్లలు , రాళ్లు ఉంటే 1 శాతం, చెడిపోయినా, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యం ఉంటే 5శాతం, ముడుచుకుపోయిన ధాన్యానికి 3శాతం వరకు మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ మినహాయింపుల ప్రకారం పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు అనుకూలంగా క్వింటాకు 3కిలోల ధాన్యాన్ని తరుగుగా నిర్దేశిస్తే వాస్తవంగా క్షేత్రస్తాయిలో మాత్రం క్వింటాకు 8 కిలోల దాకా తరుగుతీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లోడ్‌ అయిన లారీ మిల్లుల వద్దకు వెళ్లాక బస్తాకు 2 కిలోల చొప్పున దాదాపు లారీకి రూ.50వేల చొప్పున మిగుల్చుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తూకం వేసినప్పుడు ఉన్న బరువు ధాన్యం తాలూకు వివరాలతో నమోదైన ట్రక్‌ షీట్‌కు… చివరకు మిల్లర్లు ధాన్యాన్ని తీసుకునేటప్పుడు ఇచ్చే నోట్‌కు తేడా ఉంటోంది.

లీడర్లు, సొసైటీ చైర్మన్లతో మిల్లర్ల కుమ్మక్కు..

రాష్ట్రంలోని కొన్ని చోట్ల సేకరించిన ధాన్యాన్ని రైసు మిల్లులకు కేటాయింపు సమయంలో ప్రజాప్రతినిధులు, సొసైటీల ఛైర్మన్లు మిల్లర్లతో కుమ్మక్కై తరుగు పేరుతో ధాన్యాన్ని దోచుకుంటున్నారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నారు. మిల్లర్లు యథేచ్ఛగా తరుగుపేరుతో దోపీడీకి దిగుతుండడంతో పలుచోట్ల రైతులు ధర్నాలకు దిగుతున్నారు. ఖమ్మం, వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిత్యం కడ్తాను నిరసిస్తూ రైతులు మిల్లుల ఎదుట, జాతీయ రహదారులపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం అసలు తరుగుతీయొద్దని హెచ్చరిస్తున్నా మిల్లర్లు మాత్రం ఇబ్బందులు పెడుతున్నారని, తరుగు తీయనివ్వకుంటే ధాన్యం లోడ్‌ను అన్‌లోడ్‌ చేసుకోవడం లేదని మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement