Sunday, April 28, 2024

బీజేపీలో ఫ్యామిలీ డ్రామా.. మా నాన్న ఉంటే వీళ్ల ఆటలు సాగేవి కావు: ఉత్పల్ పారికర్

‘‘బీజేపీలో ఫ్యామిలీ డ్రామాకు తెరతీశారు. మొన్నా మధ్య బీజీపీ చీఫ్ నడ్డా గోవాకు వచ్చినప్పుడు ఆయనకు అయిదు జంటలు టిక్కెట్లు కావాలని కోరాయి. అదే ఇప్పుడు నిజమవుతోంది. మా నాన్న మనోహర్ పారికర్ ఉంటే ఏ ఒక్క వ్యక్తి తమ ఫ్యామిలీకి సీటు కావాలని అడిగే సాహసం చేసి ఉండకపోవచ్చు. కానీ, ఇప్పుడు గోవాలో సీన్ మారింది’’. అని గోవా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ అన్నారు.

బీజేపీకి రాజీనామా చేసిన ఉత్పల్.. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే బీజేపీని వీడడం అత్యంత బాధాకరమైన నిర్ణయమేనని చెప్పుచొచ్చారు. అయినా తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని అన్నారు. పనాజి నియోజకవర్గం నుండి బీజేపీ మంచి అభ్యర్థిని నిలబెట్టినట్లయితే తాను ఎన్నికల రేసు నుండి వైదులుగుతానని చెప్పారు.

తన తండ్రి, పార్టీలో సీనియర్ అయిన మనోహర్ పారికర్.. రెండు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహించిన పనాజీ నియోజకవర్గం నుండి ఉత్పల్ పారికర్ కు బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నిర్ణయంపై కలత చెందిన అతను శుక్రవారం బీజేపీని వీడారు. ఫిబ్రవరి 14న జరిగే ఎన్నికల్లో పనాజీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, 2019 జులైలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన 10 మంది శాసనసభ్యులలో ఒకరైన సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సెరేట్‌కు బీజేపీ పనాజి సీటు కేటాయించింది. కాగా, మైనర్‌పై అత్యాచారం కేసుతో సహా క్రిమినల్ కేసులను మోన్సెరేట్ ఎదుర్కొంటున్నారు. శనివారం ఓ వార్తా సంస్థతో  మాట్లాడిన మనోహర్ పారికర్ పెద్ద కుమారుడు ఉత్పల్ బీజేపీ ఎల్లప్పుడూ తన హృదయంలో ఉందని, పార్టీ ఆత్మ కోసం పోరాడుతున్నానని అన్నారు. పార్టీని వీడాలనే నిర్ణయం తనకు అంత ఈజీ కాదన్నారు.

తన తండ్రి మరణంతో 2019లో జరిగిన పనాజి ఉపఎన్నికను ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో కూడా తనకు టిక్కెట్ ఇవ్వడానికి బీజేపీ నేతలు అంగీకరించలేదని గుర్తు చేశారు ఉత్పల్ పారికర్. గోవాలో బీజేపీ పార్టీ పతనం అవుతోందని అన్నారు. “నడ్డాజీ (బిజెపి అధినేత జెపి నడ్డా) గోవాకు వచ్చినప్పుడు ఐదు జంటలు పార్టీ టిక్కెట్లు కోరాయి. మనోహర్ పారికర్ జీవించి ఉంటే ఏ ఒక్క లీడర్ వారి భార్య కోసం టిక్కెట్ కోరే సాహసం చేసి ఉండేవారు కాదు ” అన్నారు. తలైగావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మోన్సెరాట్ భార్య జెనిఫర్‌ను బీజేపీ పోటీకి దింపిందని తెలిపారు. హెల్త్ మినిస్టర్ విశ్వజిత్ రాణే, అతని భార్య దివ్య రాణేలకు వేర్వేరు స్థానాల నుండి టిక్కెట్లు దక్కాయని గుర్తు చేశారు. దీనిని ప్రస్తావిస్తూ, రాజకీయాల్లో “కుటుంబ రాజ్యం”కి వ్యతిరేకంగా తన తండ్రి ఎలా గళం విప్పారో  గుర్తు చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement