Saturday, April 27, 2024

Exclusive – పూన‌కాలు లోడింగ్‌! విషం కూడా వారికి అమృతమే!

ఓ నిశిరాత్రి వేళ.. హైదరాబాద్​ శివారులోని ఓ ఫామ్​ హౌజ్​లో అదిరిపోయే పార్టీ జరుగుతోంది. సంపన్నుల బిడ్డలంతా కలిసి రేవ్​ ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి తెల్లవార్లూ అక్కడ డీజే మోతలు.. డ్యాన్స్​ల హోరు.. అసలు వీరికింత శక్తి ఎక్కడి నుంచి వస్తోంది. ఈ పూనకాలకు కారణమేంటన్నది చాలామందికి తెలియకుండా పోయింది. అయితే.. దీన్ని మరింతగా పరిశోధించగా, ఈ పూనకాల లోడింగ్​కి గల కారణాలు బయటపడ్డాయి. ఇది తెలిసిన వైద్య నిపుణులు ఆశ్యర్యపోతున్నారు. స్నేక్​ వీనమ్​ డ్రగ్​ రూపంలో తీసుకోవడం వల్లే వారిలో రోజులపాటు ఒళ్లు తెలియని ఆనందం వచ్చిందన్నది స్పష్టమయ్యింది. ఒక్క హైదరాబాద్​లోనూ కాదు.. దేశంలోని పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలకు ఈ జాడ్యం పాకింది. అయితే.. సెలబ్రిటీలు, బడాబాబుల బిడ్డలు ఈ డ్రగ్​కి బాగా అలవాటుపడ్డట్టు బిగ్​బాస్​ విన్నర్​ ఎల్విష్​ యాదవ్​ చెబుతున్నాడు. స్నేక్​ వీనమ్​ అమ్ముతున్న కేసులో ఇటీవలే ఎల్విష్​ని అరెస్టు చేశారు. అతను బయటపెట్టిన అంశాలతో స్నేక్​లే షేక్​ అయ్యి.. పారిపోయేలా ఉన్నాయి. ​

(ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ ప్రతినిధి) – ప్రస్తుతం పాములు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. అటవీశాఖా అధికారుల కళ్లపడితే తీసుకువెళ్లి అడవిలో వదిలేస్తుంటే.. వామ్మో కొత్త పాములోళ్లు పట్టుకెళ్లి రోజూ విషవ‌ కక్కిస్తున్నారని .. నాగుపాములు బుస్ బుస్ అంటూ ఘోష పెడుతున్నాయి. ఇదేంటీ.. భ‌లే తమాషాగా ఉందే అనుకుంటున్నారా.. అవును.. ఇదే నిజం !!.. పాముల బతుకులతోనూ నోట్ల వర్షం కురిపించే స్నేక్ వీనమ్ మాఫియా తెరమీదకు వచ్చింది. హా.. అట్లనా..? అని ఆశ్చర్య పోవద్దు. ఇది మాత్రం పాము విష‌మంత‌ పచ్చినిజం.

పాముల ప్రాణం.. రేవ్ కొచ్చిందోచ్..

రేవ్ పార్టీలు పేరు వినపడటం ఆలస్యం, ఐటెమ్ సాంగ్స్ యాదికొస్తాయి.. బాగా డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు ఈ పార్టీల్లో చిందిలేస్తారనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఈ పార్టీలే భిన్నంగా ఉంటాయి. ఇందులో మందు, చిందు మాత్రమే కాకుండా.. అంతకు మించి ఉంటుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అశ్లీల నృత్యాలు, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఇలా అనేక రకాల ఇల్లీసిట్‌ యాక్టివిటీస్ సర్వసాధారణం. అయితే.. ఈ పార్టీల రూపు రేఖలే కాదు.. కొత్త ఒరవడి కూడా ప్రత్యక్షమైంది. అదే స్నేక్ వెనమ్ అనే పదం బాగా వినిపిస్తోంది. స్నేక్ వెనమ్ అంటే పాము విషం. వామ్మో విషమా? అంటే మామూలు విషయం కాదు.. మరి.. అత్యంత ప్రమాదకర విషాన్ని ఈ పార్టీల్లో ఏం చేస్తున్నారు? అసలు ఆ విషాన్ని ఎందుకు వాడుతున్నారు? అని గుండెలదరటం ఖాయం. కానీ, ఇదే విషాన్ని అమృతంలా తాగేస్తున్నారు తెలుసా? బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఈ మ‌ధ్య చెప్పిన కొన్ని విష‌యాల‌తో ఇప్పుడీ స్నేక్ వెనమ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.

స్నేక్ వీన‌మ్ గుట్టు ర‌ట్టు ఇలా..

ఇటీవల బిగ్ బాస్ హిందీ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే అక్రమంగా స్నేక్ వెనమ్‌ను సరఫరా చేస్తున్నాడని ఆరోపణ ఉంది. పోలీసు కస్టడీలో ఎల్విష్ యాదవ్ నుంచి అనేక కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యలోనే అసలు స్నేక్ వెనమ్ అంటే ఏంటి అని అంతా వెతుకులాట మొదలెట్టారు. రేవ్ పార్టీల్లో స్నేక్ వెనమ్‌ని ఒక మత్తు పదార్థంగా.. ఉత్ప్రేర‌కంగా మార్చేసి వాడేస్తున్నారు. రేవ్ పార్టీల్లో వినియోగించే స్నేక్ వీన‌మ్ ప్ర‌భావం ఐదు గంటల నుంచి ఐదారు రోజుల వరకు ఉంటుంది. దీని వినియోగంతో ఎంతో శక్తివంతంగా ఫీలవుతారు. ఎక్కువ సేపు డాన్స్ కూడా చేయగలరు. ఈ కారణాలతో చాలామంది సెలబ్రిటీలు స్నేక్ వెనమ్ తీసుకుంటున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.. దీనికి అడిక్ట్ అయితే ప్రాణానికే ప్రమాదం అని చెప్తున్నారు వైద్య నిపుణులు. ఇదొక మాన‌సిక రుగ్మతగా మారిపోతుంది. ఒక్కో సందర్భంలో ప్రాణాలు కూడా పోతాయి. ఇలాంటి కల్చర్ విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయ్యింద‌న్న‌ది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. స్నేక్​ వీనమ్​కు అలవాటు కావడాన్ని అఫిడిజమ్​గా వైద్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

యమ డిమాండు గురూ..

డ్రగ్స్ మాఫియాలో స్నేక్ వీన‌మ్‌కు య‌మా డిమాండు ఉంది. దీన్ని కొకైన్, హెరాయిన్ పౌడర్ రూపంలోకి మార్చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్నేక్ వీనమ్‌కు వేల కోట్ల రూపాయ‌ల‌ డిమాండు పెరిగింది. అసలు దీన్ని ఎలా సేకరిస్తారంటే.. ప్రపంచం మొత్తంలో 3500 రకాల పాము జాతులున్నాయి. అయితే.. అవన్నీ ప్రమాదకరం కాదు. వాటిలో కేవలం 25శాతం పాములు మాత్రమే ప్రమాదకర విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. వాటితోనే మనిషి ప్రాణానికి హాని జరుగుతుంది. దేశంలో ఉండే పాము జాతుల్లో నాగుపాము విషం ఎంతో ప్రమాదకరం. ఈ నాగుపాము విషానికి రేవ్ పార్టీల్లో బీభత్సమైన డిమాండ్ ఉంది. దీని ధర రూ.కోట్లల్లో కూడా పలుకుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణ‌లోనూ దందా..

దేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అటవీ ప్రాంతాల్లోని నాగుపాములను పట్టి విషాన్ని సేకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాముల బెడద తప్పించుకోవటానికి పాములోళ్ల కుటుంబాలను పోషిస్తుంటారు. పాము కాటేసిన వ్యక్తుల్ని కాపాడేందుకు పాములోళ్లు సాయం చేస్తుంటారు. ఇళ్లల్లో ప్రవేశించిన పాముల్ని పట్టుకుంటారు. ఈ జీవన శైలిని స్నేక్ వెన‌మ్ మాఫియా మార్చేసింది. ప్రత్యేకించి పాముల్ని పట్టుకునే పరికరాలను అందించి.. అడవులకు పాములోళ్లను పంపిస్తోంది. ఒక తులం (పది మిల్లీ లీటర్లు) విషాన్ని సేకరిస్తే రూ.4 వేలు ఇస్తే… ఇప్పుడు ఈ ధర రూ. 6వేలకు చేరింది. కానీ, దళారీ ఎంతకు అమ్ముతాడో తెలుసా? తులం విషం రూ.60లక్షలు. అంటే లీటరు విషం రూ.6కోట్లు అన్నమాట. ఇది కాస్తా.. డిస్ర్టిబ్యూటర్ చేతికివెళ్తే.. వినియోదారుడికి సాదా సీదాగా దొరకదు.

పాము విషంలో ఏముంటుంది..

పాము విషం మూడు రకాలు. హెమో టాక్సిక్, సైటో టాక్సిక్, న్యూరో టాక్సిక్. హెమో టాక్స్‌క్ గుండెపైన, సైటో టాక్సిక్ శ‌రీర కణాలపైన, న్యూరో టాక్సిక్ నాడీ వ్యవస్థపైన పని చేస్తాయి. పాము లాలా జల గంథ్రుల నుంచి విషం ఉత్పత్తి జరుగుతుంది. నిజానికి లాలా జల గంథ్రులు ఆహార జీర్ణాన్ని సులభతరం చేస్తాయి. కానీ, పాముల కోరల్లోని వేనమ్ నోటిలోని జూటాక్సిన్ లాలా జల గంథ్రుల్ని కలవగానే అది విషంగా మారిపోతుంది. ఇలా పాము కోరల్లోని విషం ప్రమాదకరమవుతుంది. పాము కాటు వేయగానే రక్త నాళాల్లో ప్రవహిస్తూ రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. దీంతో గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గుండె కొట్టుకోవ‌డం ఆగిపోయి మ‌ర‌ణం సంభ‌విస్తుంది.

ఔషధాల తయారీలోనూ పాము విషం

యాంటీవీనమ్ వంటి ఔషధం పాము విషం నుంచే తయారు చేస్తారు. పెయిన్స్, కేన్సర్, ఆర్థరైటీస్, స్ట్రోక్స్, హార్ట్ డిసీజ్, హిమోఫిలియా, హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యల‌ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు దీని నుంచే తయారు చేస్తారు. శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం జరగకుండా నిరోధించడానికి అవసరమైన ఔషధాల్ని కూడా పాము విషంతో తయారు చేస్తారు. ఇక యాంటీ వీనం ఔషధ తయారీ సంస్థలు పాముల విషాలను సేకరిస్తుంటాయి. 2020లో ప్రపంచ వ్యాప్తంగా యాంటీవీనం మార్కెట్ విలువ రూ. 96, 938 కోట్లు. 2026 నాటికి యాంటి వీనం మార్కెట్ విలువ రూ. 1,58,501కోట్లకు పెరుగుతుందని అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement