Friday, September 22, 2023

Exclusive: మేడారంపై కేంద్రం స్పెషల్​ ఫోకస్​.. గిరిజన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు చర్యలు

(కోహిమా నుంచి ఆంధ్రప్రభ ప్రతినిధి స్వరూప పొట్లపల్లి): ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వ తారీకు వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు మరింత శోభ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ జాతర మరింతగా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రూపేందర్ బ్రార్ వెల్లడించారు.

నాగాలాండ్ రాజధాని కోహిమాలోని కిసామా హెరిటేజ్ విలేజ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్‌లో పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్‌తో కలిసి ఆదివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రప్రభ’తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. గిరిజనుల జీవన శైలి, ఆచార వ్యవహారాలు తెలుసుకునేలా ట్రైబల్ ఫుడ్ ఫెస్టివల్, వారు రూపొందించిన కళాకృతులు, కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు రూపేదర్ బ్రార్ తెలిపారు. గిరిజనులు ఇప్పటికీ తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారని, వాటి గురించి అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వారిని ప్రోత్సహిస్తే, ఎప్పటికీ గిరిజన సంస్కృతి సజీవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
   

టూరిజం రంగం అభివృద్ధి చెందితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. హోమ్ స్టే వంటి సదుపాయాల ద్వారా మారుమూల పల్లెల్లో ఉన్న వారికి సైతం ఆదాయం లభిస్తుందన్నారు. పర్యాటకం అభివృద్ధి చెందాలంటే పట్టణాలు, నగరాలను తలపించే సదుపాయాలే ఉండాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలకు చెందిన పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులను అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తమకు మద్దతు లభిస్తోందని ఆమె చెప్పారు.

పర్యాటక ఆకర్షణలపై ప్రజెంటేషన్
ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్‌లో 2వ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కోహిమాకు 12 కి.మీ దూరంలో ఉన్న హెరిటేజ్ విలేజ్‌లో 8 ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక, పర్యాటక, రవాణా, హోటల్ రంగాలకు సంబంధించిన అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక ఆకర్షణల గురించి ఆయా రాష్ట్రాల అధికారులు వివరించారు. రాఫ్టింగ్, ట్రెక్కింగ్, సాహస యాత్రలు, ఆదివాసీ జాతరలు, వేడుకలు, పండుగలు, భిన్న ఆహార శైలులు, ఫుడ్ ఫెస్టివల్స్ కి ఉన్న అవకాశాలు, వైన్ టూరిజం వంటి అంశాలపై ప్రజంటేషన్లలో వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మకందారులు, కొనుగోలుదారులు, ట్రావెల్స్, హోటల్ రంగాలకు సంబంధించిన పెట్టుబడిదారులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, భాగస్వాములు చర్చలు జరిపారు.

‘ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్’లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ప్రాంత ప్రత్యేకతల గురించి సెమినార్లో తోటివారితో పంచుకున్నారు. పురాతన కాలం నాటి పద్ధతులు ప్రతిబింబించేలా నాగా మహిళలు నడుపుతున్న కోహిమా విలేజ్‌ను ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మీడియా బృందం సందర్శించింది. ఆ తర్వాత మీడియా ప్రతినిధులను మ్యూజియంకు తీసుకెళ్లారు. నాగాలాండ్‌లో హోటల్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి హోమ్ స్టే కల్పిస్తున్న హోటళ్లను సందర్శించారు. నాగా సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పేలా గిరిజనులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

అడుగడుగునా వైవిధ్యం
ఈశాన్య రాష్ట్రాల సొంతం: అజయ్ భట్ (కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి)
అడుగడుగునా వైవిధ్యంతో కూడిన పర్యాటక ఆకర్షక ప్రాంతాలకు ఈశాన్య భారతదేశం నిలయమని 9వ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 2వ రోజు కార్యక్రమాలను ప్రారంభిస్తూ కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ అన్నారు. ఎంతో వైవిధ్యం, భిన్నత్వం కల్గిన ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అత్యంత స్వచ్ఛమైన ప్రకృతి నడుమ కొలువైన ఈశాన్య రాష్ట్రాలకు ప్రకృతే ప్రధాన పర్యాటక ఆకర్షణ అని తెలిపారు. ఇక్కడ ఎకో-టూరిజం కు విస్తారమైన అవకాశాలున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement