Thursday, May 2, 2024

ఢిల్లీకి ఈటల.. బీజేపీలో చేరేందుకేనా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఈటల బీజేపీలో చేరనున్నారని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని బలం చేకూరుస్తూ ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో చేరతారన్న ప్రచారంతో ఈటల ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ ప్రయాణంతో తెలంగాణ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లున్నట్లు సమాచారం. ఈటల చేరికకు ఇప్పటికే బీజేపీ ఆగ్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఆయన హస్తిన బాట పట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈటల భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌ షా అపాయింట్‌మెంట్ దొరికిన వెంటనే ఢిల్లీకి ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే బీజేపీలో చేరతారా? లేక మళ్లీ ఇది చర్చల కోసమేనా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీలో చేరాక ఈటల రాజీనామా చేసే అవకాశం ఉంది.

తెలంగాణలో కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. భూకబ్జా ఆరోపణలతో ఆయన్ను సీఎం కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి తప్పించారు. దీంతో  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇది వరకే చెప్పిన ఈటల.. కొత్త పార్టీ పెడతారా? లేదంటే వేరే పార్టీలో చేరతారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఈటల రాజేందర్‌పై బీజేపీ దృష్టి సారించింది. పార్టీలోకి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. 

భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి ఈటలను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే, మధ్యలో బీజేపీ, కాంగ్రెస్ నేతలతోనూ భేటీ అయ్యారు. దీంతో ఆయన జాతీయ పార్టీలో చేరుతారనే జోరుగా ప్రచారం జరిగింది. అయితే, దీనిని ఈటల ఖండించారు. మద్దతు కోసమే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను కలిసినట్లు వివరించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం కంటే.. బీజేపీలో చేరితే బెటర్ అని అనుచరులు ఈటలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులకు రహస్యంగా మంతాలు కూడా జరిపారు. ఈటలను బీజేపీలో చేర్చుకునేందుకు పార్టీ జాతీయ నాయకత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆయన పార్టీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.  

కాగా, ఇటీవల శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆయనతో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరతారని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో వీరు ఆయనను కలిశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఐక్య వేదికను ఏర్పాటు చేద్దామని సూచించారు. అయితే, ఈటల మాత్రం బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement