Thursday, May 2, 2024

హుజూరాబాద్ రాజకీయం.. టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్న ఈటల వర్గం

తెంగాణలో హుజురాబాద్‌ కేంద్రంగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నియోజకవర్గంలో ఈటలను ఏకాకిని చేయాలని టీఆర్ఎస్ చేస్తున్న ప్రణాళికలు రివర్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హుజూరాబాద్ లో ఈటల వర్గం, టీఆర్ఎస్ వర్గం అన్నట్లుగా రెండుగా చీలిపోయింది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈటల వెంట వెళ్లకుండా ఉండేందుకు నేతలను రంగంలోకి దింపింది. ఈటలకు చెక్‌ పెట్టేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ‘ఆపరేషన్ హుజురాబాద్’ షురూ చేసింది. ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్, హరీష్ రావు హుజురాబాద్ నేతలతో మాట్లాడారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు ఈటల వర్గం నుంచి అడుగడుగునా నిరసనలే ఎదురవుతున్నాయి.

నిన్న వీణవంకలో నిర్వహించిన సమావేశంలో ‘జై ఈటల’ అంటూ నినాదాలు చేశారు. తాజాగా ఆదివారం మామిడాలపల్లిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. టీఆర్ఎస్ సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కాన్వాయ్‌ను ఈటల అభిమానులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నాయకులను అడ్డుకుని ‘జై ఈటల’ అంటూ నినాదాలు చేశారు. ప్రజల్లో ఎంతో మంచి పేరున్న ఈటలపై కుట్రపూరితంగానే ఆరోపణలు చేశారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. దమ్ముంటే ఈటలను పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

శనివారం వీణవంకలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశం కూడా రసాభాసగా మారింది. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ మాట్లాడుతూ ఈటల వెంట ఎవరూ వెళ్లవద్దని కోరారు. వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీయే ముఖ్యమని నారదాసు లక్ష్మణ్ వ్యాఖ్యలు చేయగానే.. కొందరు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు ఈటల వెంటే ఉండి, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారా ? అని నిలదీశారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఈటల అనుకూల నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ఈటలకు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో సభ రసాభాసగా మారింది. అయితే, పోలీసులు కల్పించుకొని వారిని బయటకు పంపించారు.

మరోవైపు హుజురాబాద్‌లో టీఆర్ఎస్ క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకు ఆ పార్టీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. మంత్రులు, సీనియర్ నాయకులు మండలాల వారీగా కార్యకర్తలతో భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల వర్గం అప్రమత్తమైంది. ఆ సమావేశాలను అడ్డుకునేందుకు ఈటల రాజేందర్ అనుచురులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది.

ఇదిఇలా ఉంటే… ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement