Friday, April 26, 2024

ఏసీడీ ఛార్జీలు చెల్లించొద్దు : బండి సంజ‌య్‌

రాష్ట్ర ప్రజలు ఏసీడీ ఛార్జీలు చెల్లించొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఏసీడీ ఛార్జీలు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. కరెంట్ చార్జీల పెంపుతో ఇప్పటికే ప్రజలపై రూ.6 వేల కోట్ల భారం మోపిన కేసీఆర్… ఏప్రిల్ నుండి మరో రూ.16 వేల కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యారని అన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని చెప్పిన బండి సంజయ్ కుమార్ ఆత్మహత్యలే లేవని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతులను ఎమ్మెల్యేలుగా చేస్తానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్సందిస్తూ దళితుడిని సీఎం చేయడం ఎంత నిజమో రైతులను ఎమ్మెల్యేలను చేస్తాననడం అంతే నిజం అని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన బండి సంజయ్ నిరూపించకపోతే కేసీఆర్ రాజకీయాల నుండి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నీళ్లు రాని గ్రామాలెన్నో ఉన్నాయి.. బట్టలుతకడానికి కూడా పనికిరావడం లేదని విమర్శంచారు. క్రిష్ణా, గోదావరిలో మన వాటా నీటినే వాడుకోవడం చేతగాని కేసీఆర్ దేశం గురించి మాట్లాడటమా? అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు మద్యం ద్వారా వేల కోట్ల ఆదాయం ఇస్తుంటే కేసీఆర్ మాత్రం 5 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్కో కుటుంబంపై సగటున రూ.6 లక్షల అప్పు భారం మోపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి, అప్పులపై చర్చకు తాము సిద్ధమని, కేసీఆర్ సిద్దమా? అని సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల, ఎమ్మెల్యేల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్దిపై ప్రశ్నిస్తే చర్చ జరగకుండా ఉండేందుకే ఎన్నికల పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు కరీంనగర్ లో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement