Wednesday, May 1, 2024

భూ వివాదాల్లోకి లాగొద్దు, కీలుబొమ్మను కాను.. చిల్లర రాజకీయాలు చేయను: ప్రభుత్వ విప్‌ రేగా

ప్రజలే దేవుళ్లుగా భావించి.. పినపాక నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సృష్టం చేశారు. పినపాక నియోజకవర్గంలో సాగుతున్న రాజకీయాలకు, ప్రత్యర్థుల ఆరోపణలకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. అఖిల పక్షం పేరుతో పోరు సాగిస్తామంటూ ప్రగల్బాలు పోతున్న సీనియర్‌ నాయకులు, నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలంటూ సవాల్‌ విసిరారు. గత ఎమ్మెల్యేలను చెప్పుచేతల్లో పెట్టుకొని కీలుబొమ్మలుగా ఆడించారన్న ఆయన.. తాను అలా చేయనందుకే చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ గళమెత్తారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్నానన్న ఆయన.. ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంకితమై ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

ప్రభ న్యూస్‌ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గంలో సాగుతున్న ఆరోపణలు, రాజకీయాలపై సోషల్‌ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటూ, పార్టీ వ్యవహారాలను ఇతర పార్టీల నేతలతో పంచుకుంటూ, పరోక్షంగా ద్రోహం చేస్తున్న వారికి తన మార్క్‌ హెచ్చరికలు చేశారు. పనిలో పనిగా నియోజకవర్గ సీనియర్‌ నాయకులుగా చెలామణి అవుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ అందరిపై ఘాటుగా విమర్శలు గుప్పించారు.

ఆడించినట్లు ఆడడానికి కీలుబొమ్మను కాను..
పినపాక నియోజకవర్గం తనకు కోవెల అని, నియోజకవర్గ ప్రజలే దేవుళ్లని ఎమ్మెల్యే రేగా పునరుద్ఘాటించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్న ఆయన, టీఆర్ ఎస్‌ పాలనలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామన్నారు. గతంలో పనిచేసిన కొందరు ఎమ్మెల్యేల్లాగా తాను కొందరు సీనియర్‌ నాయకుల చెప్పుచేతల్లో ఉండటం లేదని, అందుకే వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, వారు ఆడించినట్లు ఆడడానికి తానేమీ కీలుబొమ్మను కాదన్నారు. పూర్వం గిరిజన ఎమ్మెల్యేలను వారు ఇష్ట మున్నట్లు ఆడించారని, ఎమ్మెల్యే అంటే వీరు లెమ్మంటే లేవాలి.. కూర్చోమంటే కూర్చోవాలన్నట్లుగా మార్చారని, లేదంటే గిరిజన ప్రజా ప్రతినిధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వివాదాలు సృష్టించే వారని మండిపడ్డారు. 40ఏళ్ల కాలంలోసీనియర్‌ నాయకులుగా మీరు నియోజకవర్గానికి చేసిందేముంది.? ప్రజలను రెచ్చగొట్టడం, పబ్బం గడుపుకోవడమేనంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

భూ వివాదాల్లోకి లాగొద్దు..
పినపాక నియోజకవర్గంలో నెలకొన్న భూ వివాదాల్లోకి తనను లాగొద్దని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు కోరారు. ప్రజల శ్రేయస్సు, ప్రజలకు న్యాయం చేసేందుకే తాను కట్టుబడి ఉంటానన్నారు. పబ్బం గడుపుకొనే నాయకుల మాటలు వింటే మొదటికే మోసం వస్తదని ప్రజలు గుర్తించాలని కోరారు. మణికంఠ నగర్‌ భూ వివాదంపై కూడా ప్రజలకు న్యాయం జరుగుతుందని, చట్టాలను అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేసే వారిపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. పార్టీలో ఉంటూ ద్వంద్వ‌ రాజకీయాలు చేస్తున్న వారికి సైతం రేగా చురకలంటించారు. సీనియర్‌ నాయకులుగా చెలామణి అవుతూ, చిన్న చిన్న వివాదాలకు పత్రికలకు ఎక్కితే చిప్పే మిగులుతుందన్న వాస్తవం గ్రహించాలని, ప్రజలు ఆదరిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నదన్నారు. ఇటీవల జరిగిన సర్వేలో పినపాక నియోజకవర్గం నుంచి రేగా కాంతారావుకే విజయావకాశాలున్నాయని తేలిందని, దీంతో కొందరికి మింగుడు పడటం లేదని, అందుకే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పార్టీలో కొందరూ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఒకే పార్టీలో ఉంటూ డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. అభివృద్ధితో ప్రజల మనసు గెలిచిన రేగాను ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement