Monday, April 29, 2024

Followup: శాంతి భద్రతల అంశంలో రాజీపడొద్దు, కఠినంగా ఉండాలే.. ఉన్నత స్థాయి భేటీలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు, సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్‌, స్టీఫెన్‌ రవీంద్ర, మహేష్‌ భగవత్‌, ఇతర పోలీసు అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం భేటీ అయ్యారు.

హైదరాబాద్​ సిటీలో పరిస్థితులను అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని, ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని చెప్పినట్లు తెలిసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రెండు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష ముగిసింది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ప్రస్తుత పరిణామాలపై సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది.

దాదాపు నాలుగు గంటలపాటు శాంతి భద్రతలపై తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో రెండో రోజు నిరసనలకు దిగారు. అలాగే బండి సంజయ్‌ అరెస్ట్‌ నేపథ్యంలో బీజేపీ పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సమీక్షలో నగరంలోని మూడు కమిషనరేట్ల సీపీలు కూడా సమావేశంలో చర్చించారు.

ఎమ్మెల్సీ కవితపై లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణలు రావడంతో గత మూడు రోజులుగా భాజపా కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. మరోవైపు పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను దించారు. మీర్‌చౌక్‌, గోషామహల్‌, చార్మినార్‌ జోన్ల పరిధిలో పహారా ఏర్పాటు చేశారు. మూడు ఏసీపీ జోన్ల పరిధిలో 360 మంది ఆర్‌ఎఎఫ్‌ జవాన్లతో పహారా కాస్తున్నారు.

పాతబస్తీలో పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు:
హైదరాబాద్‌లో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని పాతబస్తీలో ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి పలుచోట్ల ట్రాఫిక్‌ మళ్లించాలని పోలీసుల నిర్ణయించారు. గస్తీ వాహనంలో తిరుగుతూ దుకాణాలను పోలీసులు మూసివేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement