Wednesday, May 8, 2024

మేడారం భ‌క్తులకు నిరాశ.. అక్కడినుంచే తిరుగుప్రయాణం..

ములుగు జిల్లాలోని ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను సంద‌ర్శించాలనుకుంటున్న మేడారం భ‌క్తులకు నిరాశే ఎదుర‌వుతోంది. ఈనెల 13నుంచి వన్‌వే అమలులోకి వస్తున్న నేప‌థ్యంలో తాజా నిర్ణయాలు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు భద్రతాపరమైన సమస్యలు ఉండటంతోనే లక్నవరం, రామప్ప సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ల‌క్నవ‌రం సంద‌ర్శన‌కు వెళ్లకుండా 163 జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న బుస్సాపురం క్రాస్‌ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. యునెస్కో గుర్తింపుతో ప్రపంచ ప్రఖ్యాంతిగాంచిన రామ‌ప్పలోనూ ఆంక్షలు కొన‌సాగుతున్నాయి. రెండు చోట్ల ఇరుకురోడ్లు, సరస్సులు ఉండటంతో భక్తులను నియంత్రించడం కష్టమని భావించే తాత్కాలికంగా సంద‌ర్శన‌ను నిలిపేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 3 రోజుల క్రిత‌మే కలెక్టర్ కృష్ణ ఆదిత్య దేవాదాయ‌, ప‌ర్యాట‌క శాఖ ఉన్నతాధికారుల‌కు లేఖ‌లు రాసిన‌ట్లుగా తెలుస్తోంది.

నిరాశ‌గా వెనుదిరుగుతున్న ప‌ర్యాట‌కులు
దూర ప్రాంతాలు, వివిధ జిల్లాల నుంచి మేడారం జాత‌ర‌కు వ‌చ్చిన భ‌క్తులు రామ‌ప్ప, ల‌క్నవ‌రం ప్రాంతాల‌ను సంద‌ర్శించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. అయితే భ‌క్తుల‌ను క‌ట్టడి చేయ‌డం అసాధ్యమ‌ని భావిస్తున్న అధికారులు తాత్కాలికంగా తీసుకున్న సంద‌ర్శన నిలిపివేత నిర్ణయంతో ప‌ర్యాట‌కులు తీవ్ర నిరాశ‌తో వెనుదిరుగుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఈనెల 16 నుంచి 19 వరకు మేడారం మ‌హా జాతర ప్రారంభ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 14 సాయంత్రం నుంచి మేడారం జాత‌ర‌కు అధిక సంఖ్యలో భ‌క్తుల రాక మొద‌ల‌వుతుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. అయితే 13న సెల‌వు దినం ఆదివారం కావ‌డంతో ఆర్టీసీ పాయింట్ల నుంచి పూర్తిస్థాయిలో బ‌స్సు స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చారు. క్యూ లైన్లను కూడా బుధ‌వారం మేడారంలో మంత్రులు ద‌యాక‌ర్‌రావు, స‌త్యవ‌తిరాథోడ్‌లు ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలోనే మేడారం జాత‌ర‌కు ల‌క్షలాది మంది భ‌క్తుల రాక ఆదివారం నుంచే మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement