Sunday, April 28, 2024

విరూపాక్ష‌.. సాయి ధ‌ర‌మ్ తేజ్ కి హిట్ట్ ఇచ్చిందా..!

ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన చిత్రం విరూపాక్ష‌. నేడు ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ఈ చిత్రంలో హీరోగా సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించాడు. మ‌రి ఈ చిత్రం సాయిధ‌ర‌మ్ తేజ్ కి విజ‌యాన్ని అందించిందా లేదా ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

క‌థ ఏంటంటే.. రుద్రవణం అనే ఊరు.. 1979 సంవత్సరం.. ఆ ఏడాది ఊళ్లో అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది. ఒక జంట చేత‌బ‌డి చేస్తున్నార‌నే నెపంతో గ్రామస్థులు వారిని సజీవ దహనం చేస్తారు. అలా జరిగిన పుష్కరం తర్వాత.. అంటే 1991లోకి ఆ ఊళ్ళోకి ఓ పని మీద సూర్య (సాయి ధరమ్ తేజ్) వస్తాడు. ఊరి అందాలతో పాటు.. సర్పంచ్ (రాజీవ్ కనకాల) కూతురు నందిని (సంయుక్త మీనన్)ను చూడగానే ఇష్టపడతాడు. అలా వాళ్ల ప్రేమకథ సాగుతుండగానే.. ఊళ్ళో వరస మరణాలు సంభవిస్తుంటాయి. దాంతో ఊరిని అష్టదిగ్భంధనం చేస్తారు. కానీ ఆ తర్వాతే మరణాల సంఖ్య పెరుగుతుంది. అమ్మవారు ఉన్న ఊళ్ళోకి దుష్ట శక్తులు ఎలా వచ్చాయి.. వచ్చిన వాటిని హీరో ఎలా అడ్డుకున్నాడు. అసలు గ్రామస్థులు ఆ జంటను చంపడానికి కారణమేంటి అనేది అసలు కథ..

- Advertisement -

విశ్లేష‌ణ‌.. విరూపాక్ష సస్పెన్స్ హార్రర్ డ్రామా చిత్రం. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమా వచ్చింది. ఎప్పటికీ బోర్ కొట్టని ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా దెయ్యాల కథలు.. ఓ ఆత్మను ఊరి మీదకి వదిలి పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకుంటే పక్కా హిట్ అని చాలా సినిమాలు నిరూపించాయి. ఇదే ఫార్ములా విరూపాక్షకు కూడా వర్కౌట్ అయింది. ఎన్నో సినిమాల్లో చూసిన ఒక ‘ఆత్మ’కథ ఇది. తెలిసిన కథే అయినా.. ఆసక్తికరమైన కథనం.. అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్ తో స్పెషల్ గా మారింది విరూపాక్ష. టెక్నికల్ గా చాలా సౌండింగ్ గా ఉంది ఈ సినిమా. సినిమా మొదలవడమే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నెమ్మదిగా కథలోకి వెళుతున్న కొద్ది వరస మరణాలు క్యూరియాసిటీ పెంచేస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. ఫస్టాఫ్ లో ఎదురైన ప్రశ్నలకు.. సెకండాఫ్ సమాధానం ఇస్తుంది. ఎంత గ్రిప్పింగ్ గా అనిపించినా.. ఈ కథలోనూ కొన్ని లోపాలు కనిపిస్తాయి. కానీ సుకుమార్ స్క్రీన్ ప్లే వాటిని కవర్ చేసింది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించడం కష్టం. అదే సినిమాకు ప్లస్ కూడా. పైగా చివరి 30 నిమిషాలు అలా కూర్చోబెట్టేస్తుంది సినిమా.

నటీనటుల న‌ట‌న‌.. సూర్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు సాయిధ‌ర‌మ్ తేజ్. తన పాత్రకు న్యాయం చేసాడు. నటనలోనూ మెచ్యూర్డ్‌గా కనిపించాడు. సంయుక్త మీనన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఆమె పాత్రను అస్సలు ఊహించలేరు. ఇక సునీల్ కారెక్టర్ అసంపూర్తిగా అనిపించింది. రాజీవ్ కనకాల, సాయి చంద్, అజయ్ పాత్రలు బాగున్నాయి. సోనియా సింగ్, శ్యామల బాగా నటించారు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ ..విరూపాక్ష పూర్తిగా టెక్నికల్ సినిమా. వాళ్లకు పెద్దపీట వేయాల్సిన సినిమా. ముఖ్యంగా కాంతార ఫేమ్ అజినీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అదిరిపోయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ సౌండ్స్ మాత్రం అదిరిపోయాయి. శామ్ దత్ సైనూద్ధీన్ సినిమాటోగ్రఫీ పీక్స్ అంతే. ఇక ఎడిటింగ్ చాలా బాగుంది. కథ పరంగా దర్శకుడు రొటీన్ రాసుకున్నా.. సుకుమార్ స్క్రీన్ ప్లే మాత్రం మామూలుగా లేదు. ఏ చిన్న ట్విస్ట్ రివీల్ చేసినా.. సినిమా మొత్తంపై ఎఫెక్ట్ పడుతుంది. ఇటుకపై ఇటుక పేర్చినట్లుగా ఈ కథనం ఉంటుంది. దర్శకుడిగా కార్తిక్ దండు తొలి సినిమాతోనే సత్తా చూపించాడు.మొత్తానికి సాయిధ‌ర‌మ్ తేజ్ కంబ్యాక్ తో విజ‌యాన్ని సాధించాడ‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి క‌లెక్ష‌న్స్ ఏ మేర‌కు వ‌స్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement