Saturday, April 27, 2024

టీఆర్​ఎస్‌ ధ‌ర్నాతో ద‌ద్ద‌రిల్లిన ఢిల్లీ.. ఇక రైతు ఉద్యమానికి కొత్త ప్రణాళిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్ష విజయవంతమైంది. నాలుగు రోజులుగా దగ్గరుండి మరీ నిరసన దీక్ష ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం సభ ప్రారంభానికి ముందు కూడా ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు సభా వేదికను సందర్శించారు. అనంతరం ఉదయం 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ మంత్రివర్గ నిరసన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో కేసీఆర్ బ్యానర్‌ను వేదిక మీద ఏర్పాటు చేశారు. వేదిక ముందు భాగంలో ప్రదర్శన కోసం వడ్లు పోశారు. వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తోపాటు మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, చీఫ్ విప్ గొంగిడి సునీత, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, రాములు, కె.ఆర్.సురేష్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు వేదికపై కూర్చున్నారు. దీక్షకు సంఘీభావంగా కేసీఆర్‌తో పాటు బీకేయూ నేత రాకేశ్ టికాయత్ వేదిక మీద కూర్చున్నారు.

వేదిక కింద కవిత, కేటీఆర్
నిరసన దీక్ష వేదిక కింద మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, పద్మా దేవేందర్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులతో కలిసి కూర్చున్నారు. వడ్ల కంకులు, ప్లకార్డులు పట్టుకుని వాటిని ప్రదర్శించారు. రైతుల జీవితాలతో రాజకీయమా? సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జడ్పీ, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, పార్టీ ఎగ్జిక్యూటివ్స్, కార్పొరేషన్ మేయర్లు ఎవరికి కేటాయించిన ప్రాంతాల్లో వారు కూర్చున్నారు. కేసీఆర్ కటౌట్లు, ప్లకార్డులు పట్టుకుని కేంద్రం తీరుపై కార్యకర్తలు నినాదాలు చేశారు.

రైతుల విషయంలో వ్యాపార దృక్పథం పనికిరాదు: నిరంజన్‌రెడ్డి
పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ ‌రెడ్డి ప్రసంగించారు. కేంద్ర మంత్రితో చర్చలకు వెళ్తే అవమానించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ప్రజలకు నూకల బియ్యం పెట్టండంటూ అవహేళన చేశారని వాపోయారు. రైతుల విషయంలో వ్యాపార దృక్పథంతో ఆలోచించకూడదని నొక్కి చెప్పారు. చెమటోడ్చి కష్టపడ్డ తెలంగాణ రైతులు పంజాబ్‌ను తలదన్నేలా పంట దిగుబడి సాధించడం గర్వించాల్సిన విషయమన్నారు. ఇదంతా కేసీఆర్ దార్శనికత ఫలితమని హర్షం వ్యక్తం చేశారు. కేవలం కొనే విషయంలోనే బాధ్యత కల్గిన కేంద్రం, ఆ పని చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. చెమటోడ్చి కష్టపడడమే కాదు, కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా రైతులకు తెలుసునని ఆయన ఉద్ఘాటించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చెంపలేసుకుని, రైతుల క్షమాపణ కోరిన నీతిమాలిన సర్కారు బీజేపీదని ఎద్దేవా చేశారు. కనీస మద్ధతు ధర కోరుతూ నాడు సీఎంగా మోదీ కేంద్రానికి పంపిన ఫైలు, ఇప్పటికీ ప్రధాని టేబుల్ దగ్గరే పెండింగులో ఉందని విమర్శించారు. దీక్ష జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, కళాకారులు హిందీ, తెలుగు భాషల్లో రాసిన పాటలు పాడారు.

రైతుబంధు దేశవ్యాప్తంగా అమలు చేయాలి : రాకేష్ టికాయత్
అనంతరం భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మాట్లాడుతూ… ఎంఎస్పీ చట్టబద్ధత కావాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలతో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖలు రాశారని చెప్పుకొచ్చారు. రైతులు, కార్మికుల గురించి మాట్లాడ్డం తప్పా అని ఆయన ప్రశ్నించారు. దేశ రైతులు పోరాడతారు. వారి హక్కు కోసమే పోరాటం చేస్తారని వివరించారు. ‘ఎంఎస్పీ గ్యారంటీ చట్టం’ కోసం పోరాటం కొనసాగుతుందని టికాయత్ తెలిపారు. దేశంలో మరో పెద్ద ఆందోళన చేపట్టాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది రాజకీయ వేదిక కాదన్న టికాయత్, రైతుల కోసం ఎవరు మాట్లాడినా ఆ వేదిక మీదకు వెళ్తానని నొక్కి చెప్పారు. వరి ధాన్యం, గింజలు తీసుకొచ్చిన రైతులు తమ పంటకు ధర కావాలని కోరుతున్నారన్నారు. రైతులకు మద్ధతుగా సంయుక్త్ కిసాన్ మోర్చా నిలబడుతుందని స్పష్టం చేశారు. విద్యుత్తు చట్టం (సవరణ)ను వ్యతిరేకిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణలో రైతులకు విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నారు. దేశమంతటా ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.

తెలంగాణ సర్కార్ ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్న విధానం దేశవ్యాప్తంగా అమలు కావాలని టికాయత్ డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు రైతులందరికీ అందడం లేదని ఆరోపించారు. రైతులకు నేరుగా సబ్సిడీ అందించకపోతే, రైతులు జీవించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కూడా వస్తానన్న టికాయత్, రైతుల మధ్యకు ముఖ్యమంత్రిని కూడా పిలుస్తానని చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటం జరిగినప్పుడు దక్షిణాది నుంచి రాలేదు, బిహార్ నుంచి రాలేదు అంటూ మాట్లాడిన విషయాలు గుర్తు చేసిన ఆయన, అప్పుడు ఎవరినీ రానివ్వలేదు. ఇప్పుడు వచ్చారంటూ వ్యాఖ్యానించారు. పదేళ్ల పాత వాహనాలు ఇక్కడ నడపడానికి వీల్లేదు అంటున్నారు, పదేళ్ల పాత ట్రాక్టర్‌ను నడుపుకోకపోతే రైతులు ఎలా వ్యవసాయం చేసుకోవాలని ప్రశ్నించారు. 4 లక్షల పాత ట్రాక్టర్లతో ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేశామని టికాయత్ గుర్తు చేశారు. అన్ని పార్టీలు కలసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కెప్టెన్ ఎవరన్న ప్రశ్న లేవనెత్తుతున్నారని, ముందు పోరాటమనేది మొదలుపెడితే, అందరూ కెప్టెన్లేనని స్పష్టం చేశారు. మీరు ప్రభుత్వంతో పోరాటం చేయండి. రైతుల విషయం మాకు వదిలేయండి. రైతుల కోసం మేము పోరాడతామని టికాయత్ భరోసానిచ్చారు. మీడియాకు కూడా ముక్తి కావాలని అభిప్రాయపడ్డారు. లేదంటే మధ్యప్రదేశ్ తరహా ఘటనలు పునరావృతం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉద్యమం కోసం ఒక ప్రణాళిక రచిస్తున్నామని, ఇంటెలిజెన్స్ వాళ్లు ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి చేరవేయాలని రాకేష్ టికాయత్ అన్నారు.

- Advertisement -

మోడీ గారూ.. ఓ నడ్డా గారూ.. కిరికిరిపెట్టే బండి సంజయ్ గారూ అంటూ సాంస్కృతిక కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాటలు పాడారు. ఉదయం 10 గంటలకు మొదలైన నిరసన దీక్ష సీఎం కేసీఆర్ ప్రసంగంతో ఒంటి గంటకల్లా ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement