Thursday, May 16, 2024

ఫేస్​బుక్​, సోషల్​ మీడియా వేదికగా నేరాలు.. ఢిల్లీలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర ముఠా

ఫేస్​బుక్​, సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్​లను ఆసరగా చేసుకుని మోసాలకు తెగబడుతున్న ఓ ముఠాని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. మేవాత్‌కు చెందిన ఈ అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా లీడర్​ సద్దాం హుస్సేన్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నిన్న (శనివారం) అరెస్టు చేసింది. నిందితుడి నుంచి ఒక పిస్టలత్​తోపాటు రెండు లైవ్ కాట్రిడ్జ్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక.. హుస్సేన్ తన నలుగురైదుగురు సహచరులతో కలిసి ఢిల్లీలోని ఒక అడ్వకేట్‌ను బెదిరించి డబ్బు డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఢిల్లీ నేషనల్​ కేపిటల్​ రీజియన్​(ఎన్‌సిఆర్‌)లోని చాలామందికి ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మహిళల వలె నటిస్తూ ఫ్రెండ్​ రిక్వెస్ట్​ పంపిస్తారని, దీంతో వారిని ఆకర్షించడం ఈ ముఠా స్పెషాలిటీ అని పోలీసులు తెలిపారు. ముందుగా స్నేహం చేస్తున్నట్టు నటించి, ఆ తర్వాత ఈ గ్యాంగ్​ వారిని ఏదో ఒక నేరంలో ఇరికించడం ద్వారా వారి నుంచి డబ్బులు డిమాండ్​ చేస్తుందన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వారి వద్ద చాలా లభించాయని పోలీసులు తెలిపారు. 

ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తామని బెదిరించడం.. లేదా వారి కుటుంబ సభ్యులకు షేర్​ చేస్తామని చెప్పి బాధితులను బెదిరించి డబ్బు డిమాండ్ చేసేవారు. తన సహచరులు ఇజాజుల్, అమ్జాద్ ఖాన్, ఇతరుల సహాయంతో ఇట్లాంటి వీడియోలను చిత్రీకరించడం తమ స్పెషాలిటీ అని సద్దాం హుస్సేన్ పోలీసులకు చెప్పాడు. అంతేకాకుండా ముఠా సభ్యులు పేదలు, నిరక్షరాస్యుల బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకుంటారని, ఆ ఖాతాలకు బాధితుల ద్వారా అమౌంట్​ ట్రాన్స్​ఫర్​ చేయిస్తారని వెల్లడించారు. ఈ ముఠా గత ఆరు నెలల్లో ఢిల్లీలో ఇట్లాంటి నేరాలకు పాల్పడుతూ 50 కి పైగా మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, బాధితులను గుర్తించేందుకు సద్దాం హుస్సేన్‌ను మరింత విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement