Sunday, April 28, 2024

భారత ఆర్మీపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

భారత సైన్యంలో మహిళలకు ప్రత్యేక, శాశ్వత కమిషన్ ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయడానికి వారికి ఫిట్‌నెస్ అవసరం అన్న నిబంధనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. శాశ్వత ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన ఆదేశాలు ఇవ్వాలంటూ దాదాపు 80 మంది మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తుది తీర్పును వెలువరించిన అత్యున్నత ధర్మాసనం ‘మన సమాజం నిర్మాణం మగవారి కోసం, మగవారి ద్వారా సృష్టించబడిందని అందరం ఇక్కడ గుర్తించాలి’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

సైన్యంలోని సెలెక్టివ్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఎసిఆర్) మూల్యాంకనం మహిళలపై వివక్ష చూపుతోందని అభిప్రాయపడుతూ, దీని అమలు సహేతుకం కాదని పేర్కొంది. ఇదే అమలైతే ఎస్ఎస్సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) ద్వారా విధుల్లోకి రాబడిన మహిళా అధికారులకు వ్యతిరేకమేనని జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అటు పిటిషన్ దాఖలు చేసిన మహిళా సైనిక ఉద్యోగుల్లో పలువురు అనేక అవార్డులు గెలుచుకున్నారని, వీరిలో చాలామంది విదేశీ ఎసైన్ మెంట్లపై చక్కగా పనిచేసి విజయాలు సాధించారని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. 2020 ఫిబ్రవరిలోనే సైన్యంలోని మహిళా అధికారులను పురుష అధికారులతో సమానంగా కమాండ్ స్థానాలకు అర్హత పొందటానికి అనుమతి ఇచ్చామని గుర్తు చేస్తూ, దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన వాదనలు వివక్షతతో పాటు, కలతపెట్టేవిగా ఉన్నాయని, శాశ్వత కమిషన్ అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement