Sunday, May 5, 2024

పాఠశాలల బంద్‌పై నేడో, రేపో ప్రకటన

తెలంగాణలో భారీగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పాఠశాలలను బంద్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో నేడో, రేపో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇన్ పలు జిల్లాల్లోని పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం. విద్యార్థులు పాఠశాలల్లో గుమిగూడటం, కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతోనే కేసులు పెరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ప్రమోట్ చేయనున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. పలు జిల్లాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకగా ఓయూలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే పలు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గురుకులాల్లో, కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా సోకింది. నాగర్ కర్నూలు జిల్లాలోని బీసీ బాలికల రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఇద్దరికి, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కస్తూర్భా బాలికల పాఠశాలలో 15 మంది విద్యార్థినులకు, జగిత్యాల భవానీ నగర్‌లోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో 20 మందికి బాలికలకు, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని కేజీబీవీలో 22 మందికి కరోనా సోకినట్టుగా ఆయా స్కూళ్ల ఉపాధ్యాయలు ప్రకటించారు. 15 రోజుల నుంచి కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా విద్యార్థులకు కరోనా సోకుతోంది. దీంతో తెలంగాణ పాఠశాలలు కరోనా భయంతో వణికిపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement